మేడ్చల్ రూరల్, జూన్ 19 : మేడ్చల్ మండలంలోని పలు గ్రామాల్లో భూగర్భ జలాల వృద్ధి, పరిరక్షణకు కృషి చేస్తున్న బాల వికాస స్వచ్ఛంద సంస్థ నూతన్‌కల్ పెద్ద చెరువును అభివృద్ధి చేసింది. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తు మేరకు ఈ వేసవి కాలంలో బహుళ ప్రయోజనాలే లక్ష్యంగా పనులు చేపట్టింది. రైతుకు మేలు చేయడంతో పాటు స్థానికులకు పని కల్పించింది.
రూ.10 లక్షలతో అభివృద్ధి..
నూతన్‌కల్ పెద్ద చెరువు నుంచి పూడికతీతలో భాగంగా దాదాపు 8,600 ట్రిప్పుల మట్టిని తవ్వి తీశారు. ఈ మట్టితో రైతుకు ఒనగూరే ప్రయోజనాలపై అవగాహన కల్పించి, రైతులు తమ కమతాలకు తరలించుకునేందుకు కృషి చేసింది. దాదాపు 190 మంది రైతులు 260 ఎకరాలకు మట్టిని తరలించారు. పూడికతీతతో చెరువులో నీటి సామర్థ్యం 2 కోట్ల లీటర్లకు పెరుగుతుందని బాలవికాస ప్రతినిధి తిరుపతి తెలిపారు. కాగా చెరువు కట్ట వెడల్పును 15 నుంచి 30 ఫీట్లకు పెంచారు. గతంలో చెరువు 15 ఫీట్లలోపే ఉండటంతో ఎండ్ల బండి గానీ, ట్రాక్టర్ గాని వెళితే ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పుకొని వెళ్లడం కష్టంగా ఉండేది. పలువురు ప్రమాదవశాత్తు కింద పడిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కట్ట వెడల్పు 30 ఫీట్లకు పెంచడంతో రెండు లారీలు కూడా ఏ ఇబ్బంది లేకుండా వెళ్లే అవకాశం ఏర్పడింది. ఇందుకోసం దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేశారు.
దిగుబడి పెరుగుదలకు అవకాశం
చెరువు పూడిక మట్టి కారణంగా పంట దిగుబడి పెరుగుతుందని, పెట్టుబడి వ్యయం తగ్గుతుందని బాలవికాస ప్రతినిధి తెలిపారు. పూడిక మట్టిలో పుష్కలంగా భూ సారం పెంచేందుకు అవసరమైన పోషకాలు ఉంటాయన్నారు. దీంతో ఎరువుల వినియోగం తగ్గి, ఎకరాకు కనీసం రూ.4వేలు పెట్టుబడి వ్యయం తగ్గించుకోవచ్చన్నారు. ఈ లెక్కన 260 ఎకరాలకు రైతులకు రూ.10.50 లక్షల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. కాగా 90 రోజుల పనితో స్థానికంగా ఉన్న ట్రాక్టర్లు, డోజర్లు, టిప్పర్లకు పని లభించింది.
బాలవికాసకు కృతజ్ఞతలు
గ్రామంలోని పెద్ద చెరువును అభివృద్ధి చేసిన బాల వికాసకు ప్రత్యేక కృతజ్ఞతలు. దాదాపు ఐదేండ్లుగా పూడిక తీయకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. అలాగే చిన్నగా ఉన్న చెరువు కట్టతో రైతులు ఇబ్బందికి గురికావాల్సి వచ్చేది. పూడికతీతతో పొలాలకు ఎరువు సమకూరినట్టయింది. కట్ట వెడల్పుతో రైతుల ఇబ్బందులు తొలగిపోయాయి.
–కవితాజీవన్, సర్పంచ్, నూతన్‌కల్