సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ): మన బస్తీ-మన బడి, బడి బాట వంటి రెండు విద్యాభివృద్ధి పథకాల ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చింది. ఎన్నడూ ఊహించని విధంగా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 214 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటిలో హాలియా, మహబూబియా వంటి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వసతి సదుపాయాలు ఆధునిక హంగులతో కల్పించారు. 2022-23 నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకట్టుకునే విధంగా స్కూళ్లు అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. హాలియా, మహబూబియాతోపాటు బోరబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజ్‌భవన్‌లోని ప్రభుత్వ పాఠశాల వంటి అనేక ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పూర్తిగా నిండిపోయాయి. అయినప్పటికీ అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్ల ఎదుట బారులు తీరుతున్నారు.
ఇంగ్లీష్ మీడియంలో బోధన
ఈ నెల 13 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయింది. మనబస్తీ-మనబడి పథకంలో భాగంగా 1 నుంచి 8వ తరగతి వరకు అన్ని తరగతులకు చెందిన విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన మొదలు పెట్టారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు ఇంగ్లీష్ మీడియం బోధనపై శిక్షణా కార్యక్రమాలు ముగించారు. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు నాణ్యమైన విద్యావిధానం అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలకు ప్రవేశాలు పొందుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 3,000 వరకు కొత్తగా అడ్మిషన్లు నమోదైనట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు.