హైదరాబాద్, జూన్17 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తెచ్చిన అగ్నిపథ్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. దేశ నిరుద్యోగ యువతకు మోదీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాల ఫలితంగానే దేశం అధోగతి పాలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. మోదీ అనాలోచిత విధానాలు జాతి హితానికి ఏమాత్రం మంచివి కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. మోదీ ఏది చేసినా ఆరంభశూరత్వమే తప్పా ఆచరణయోగ్యమైనవి కావని ఆయన తేల్చిచెప్పారు.
నల్లధనాన్ని వెలికి తీస్తామని, దేశ ప్రజలందరి ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తామని గొప్పలు చెప్పుకున్నారే కానీ ఒక్క పైసా ఎవరికీ వేయలేదని ధ్వజమెత్తారు. స్విస్‌బ్యాంకులో 8 ఏండ్ల క్రితం ఉన్న డబ్బుకు ప్రస్తుతం ఉన్నదానికి పోలికే లేదని, స్విస్ బ్యాంకులో దాచుకున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగిందని ఆ బ్యాంకు విడుదల చేసిన తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. అలాగే నోట్ల రద్దు, జీఎస్జీ వంటి నిర్ణయాలు దేశ ప్రజలను, చిన్న, పెద్దా వ్యాపార, పారిశ్రామిక వేత్తలను కుదేలు చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగుచట్టాల మాదిరిగానే అగ్నిపథ్ పేరిట తీసుకొచ్చిన పథకంతో మోదీ అభాసుపాలు కాకతప్పదన్నారు. కేంద్రం తెచ్చింది అగ్నిపథ్ కాదు.. యువతను ఆవారా, బేవార్స్‌గా మార్చే పథ్ అని ఆయన దుయ్యబట్టారు.
నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడే అగ్నిపథ్‌ను కేంద్రం తక్షణమే ఉపసంహరించుకొని, దేశ యువతకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీలంకలో అదానీకి మోడీ చెబితేనే కాంట్రాక్టు ఇచ్చామని అకడి అధికారులు బహిరంగంగా చెప్పారంటే మోదీ ప్రతిష్ట ఎంత దిగజారిందో తెలిసిపోతుందని ఆయన ఉదహరించారు. ఇప్పటికైనా మోదీ తన నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన సూచించారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీచేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో తిరుగుబాటు మొదలైందని, మోదీకి ఇక ముందున్నవన్నీ గడ్డురోజులేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు దమ్ముంటే కేంద్రంతో పోరాటం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
కేంద్రంపై యువత తిరుగుబాటు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
దేశవ్యాప్తంగా యువత కేంద్రంపై తిరుగుబాటు ప్రారంభించిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు అవగాహనేలేదన్నారు. రైల్వే స్టేషన్లు కేంద్రం పరిధిలో ఉంటాయన్న కనీస పరిజ్ఞానం సంజయ్‌కు లేదని ఆయన మండిపడ్డారు. అగ్నిపథ్ దేశంలో అగ్గి రాజేసిందని, అది కేవలం సికింద్రాబాద్‌లోనే మొదలైనట్టు సంజయ్ వ్యాఖ్యానించటం ఆయన అవివేకానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రైల్వే పోలీసుల ఆధీనంలో ఉంటుదనే విషయం బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. ప్రధాని మోదీ అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాల్లో అగ్నిపథ్ చేరిపోయిందన్నారు. ఈ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
నిరుద్యోగులపై రైల్వే పోలీసు కాల్పులు హేయం
నిరుద్యోగ యువతపై పోలీసులు కాల్పులు జరపడం హేయం. సంప్రదాయాలకు విరుద్ధంగా ఆర్మీ నియామకాల్లో కేంద్రం అగ్నిపథ్‌ను ప్రవేశపెట్టడం అన్యాయం. కేంద్రం వెంటనే ఈ ప్రతిపాదనలను విరమించుకోవాలి. ఈ స్కీమ్ ద్వారా ఆర్మీలో కాంట్రాక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టడం అన్యాయం. అర్మీ అభ్యర్థులు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా పోరాడాలి.
-జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
యువతను చంపడమే దేశభక్తా?
యువతను చంపడమే మోదీ మార్క్ దేశభక్తా? సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కాల్పుల ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాలి. మరణించిన రాకేశ్ కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
-డాక్టర్ తిరుపతయ్య, బీ రాజు, మానవహక్కుల వేదిక
కిషన్‌రెడ్డి రాజీనామా చేయాలి
సికింద్రాబాద్ ఘటనకు నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాజీనామా చేయాలి. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దుర్మార్గం. ఆగ్నిపథ్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి.
-రోహిత్ వక్రాల, వినయ్‌కుమార్ , తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరమ్
అగ్నిపథ్‌ను రద్దు చేయండి
యువత ఉపాధికి భద్రత ఇవ్వని అగ్నిపథ్‌ను కేంద్రం రద్దు చేయాలి. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద నిరసన తెలుపుతున్నవారిపై రైల్వే పోలీసులు కాల్పులు జరపడం గర్హనీయం. కేంద్రం వెంటనే ఉద్యమకారులతో చర్చలు జరపాలి.
-సూర్యం, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి