కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 17: చైన్ స్నాచింగ్‌లు, పార్కింగ్ చేసిన వాహనాలను దొంగిలిస్తున్న నిందితుడు కేపీహెచ్‌బీ కాలనీ పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి రూ. ఐదు లక్షల విలువజేసే 9 తులాల బంగారు నగలు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఇరానీ గ్యాంగ్ పేరుతో పలు రాష్ర్టాల్లో దొంగతనాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. శుక్రవారం కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డీసీపీ కె.శిల్పవల్లి వివరాలు తెలిపారు. స్థానిక అడ్డగుట్ట సొసైటీ మైత్రీనెట్ అపార్టుమెంట్లో నివసించే అనూరాధ ఈనెల ఒకటిన ఇంటికి సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా వెనుకనుంచి బైక్‌పై వచ్చిన దుండగుడు ఆమె మెడలో నుంచి పుస్తెల తాడును లాక్కొని పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. అన్ని ప్రాంతాల్లో నిఘా పెట్టి తనిఖీలు చేపట్టారు. కాగా.. శుక్రవారం మియాపూర్‌లో అనుమానాస్పద స్థితిలో కనిపించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. దీంతో అతడు పాత నేరస్తుడని తేలింది.
అతడి నేరాల చిట్టా కూడా బయటపడింది. బోపాల్ నగరంలోని సంజయ్‌నగర్ కాలనీలో నివసించే ముర్తూజా అలీ (36) మొబైల్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యాపారంలో వచ్చిన డబ్బుతో జీవితం గడవడం కష్టంగా మారింది. దీంతో అతడు సులభంగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనాల బాటపట్టాడు. సైబరాబాద్, హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, భోపాల్‌లో ఇప్పటి వరకు 90 దొంగతనాలు చేశాడు. అతడిపై 2016లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పీడీ యాక్టు కూడా నమోదైంది. జైలు శిక్షను పూర్తి చేసుకుని గత ఏడాది జూన్‌లో జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు శిక్ష అనుభవించినా.. అతడి తీరు మాత్రం మారలేదు. దొంగతనాలు చేస్తూ జైలుకు వెళ్లి వచ్చాడు. నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. కేపీహెచ్‌బీ కాలనీ, మియాపూర్, బాచుపల్లి, చందానగర్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన ఐదు దొంగతనాల కేసుల్లో రూ. 5 లక్షల విలువైన 9 తులాల బంగారు నగలతో పాటు ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన కేపీహెచ్‌బీ కాలనీ పోలీసు బృందాన్ని డీసీపీ అభినందించారు. సమావేశంలో ఏసీపీ చంద్రశేఖర్, సీఐ కిషన్ కుమార్, డీఐ వెంకటేశం, డీఎస్ఐ శ్యామ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.