సైదాబాద్, జూన్ 15 : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయటానికి చేపట్టిన బడిబాట కార్యక్రమం మంచి ఫలితాలను సాధిస్తుంది. బడిఈడు పిల్లలు సర్కార్ బడిలోనే చదువాలని ప్రచారం పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. బడిబాట కార్యక్రమంలో బడి ఈడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేరేవిధంగా చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. బడి మానేసిన చిన్నారులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించటంతో బడిబాట కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
తల్లిదండ్రులకు అవగాహన..
సైదాబాద్ మండల పరిధిలో నిర్వహిస్తున్న బడిబాట సక్సెస్ అయింది. బడి మానేసిన విద్యార్థులను గుర్తించి వారందరినీ పాఠశాలలో చేరే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడంవల్ల కలిగే ప్రయోజనాలను ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల కంటే తల్లిదండ్రులే ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలపై అవగాహన కలిగి ఉండటంతో తమ చిన్నారులను సర్కార్ పాఠశాల్లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఇంగ్లిష్ మాధ్యమంలో బోధిస్తుండటంతో విద్యార్థులు చదువుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
అడ్మిషన్ల కోసం పెరిగిన విద్యార్థుల తాకిడి ..
మండల పరిధిలోని మలక్పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శంకేశ్వర బజారు ఉన్నత పాఠశాల, బాగ్ మూసారియా ఉన్నత పాఠశాల, నెహూ మెమోరియల్ స్కూళ్లలో విద్యార్థుల ఆడ్మిషన్లు సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రోజురోజుకూ అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుండటంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవటంలో ప్రధానోపాధ్యాయులు సన్నాహాలు చేస్తున్నారు.