ఎర్రగడ్డ, జూన్ 15: పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అధికారులతో కలిసి బోరబండలో బుధవారం పర్యటించారు. ఎన్ఆర్ఆర్ పురం సైట్-1 కాలనీలో నిర్వహించిన పాదయాత్ర నిర్వహించారు. విద్యుత్ , తాగునీటి సరఫరా, పారిశుధ్యం, తదితర సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ సీఎం పరిపాలన విధానం దేశానికే ఆదర్శంగా నిల్చిందని అన్నారు. సుపరిపాలన అంటే ఏమిటో కేసీఆర్ మాటల్లో కాకుండా చేతల్లో ఆవిష్కరించారన్నారు. ఒకప్పుడు బోరబండ అంటే రౌడీ షీటర్లు, గొడవలు, భూకబ్జాలు.. కానీ నేడు అవన్నీ కనుమరుగై బోరబండ బంగారు బండగా మారిందన్నారు.
డివిజన్ అభివృద్ధి కోసం ఏండేండ్ల వ్యవధిలో కోట్లాది రూపాయలను మంజూరు చేయించామన్నారు. మౌలిక సదుపాయాల విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తేవాలని.. డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే స్థానికులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, డివిజన్ ఇన్చార్జి సయ్యద్సిరాజ్, కోఆర్డినేటర్ విజయసింహ, నేతలు ఏడీ మధు, సత్తార్, ఫజల్, ధర్మ, సలీం తదితరులు పాల్గొన్నారు. బల్దియా డిప్యూటీ కమిషనర్ రమేశ్, అధికారులు సైదులు, రాజ్‌కుమార్, శ్యామ్, వేణు తదితరులు పాల్గొన్నారు.
యూసుఫ్‌గూడ సర్కిల్లో..
జూబ్లీహిల్స్,జూన్15: పట్టణ ప్రగతిలో భాగంగా బల్దియా సిబ్బంది వర్షంలో పనులు చేపట్టారు. భారీ వర్షాలు వస్తే వరదనీరు వెళ్లేందుకు రోడ్లపై మట్టి తొలగింపు పనులు చేపడుతున్నారు. రోడ్లపై పేరుకుపోతున్న వ్యర్థాలను ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. దీంతో రోడ్లపై ఎక్కడా మట్టి, వ్యర్థాల జాడ కనిపించడం లేదు. యూసుఫ్‌గూడ సర్కిల్లో యుద్ధప్రాతిపదికన వ్యర్థాలను ఎత్తివేస్తున్నారు. ప్రతివార్డులో జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది ముమ్మరంగా పనులు చేపడుతున్నారు. ప్రతి వీధిలో.. ప్రతి గల్లీలో ఎక్కడా కూడా చెత్త, డెబ్రిస్ లేకుండా అప్పటికప్పుడు వాటిని పట్టణ ప్రగతి వాహనాలలో తరలిస్తుండటంతో ప్రజలకు పారిశుధ్య సమస్యలు కనుమరుగవుతున్నాయి. యూసుఫ్‌గూడ సర్కిల్లో చేపట్టిన పనులను డీఎంసీ రమేశ్ పరిశీలించారు.
సనత్‌నగర్‌లో…
అమీర్‌పేట్, జూన్ 14 : పట్టణ ప్రగతితో భాగంగా సనత్‌నగర్‌లో డెబ్రిస్ తరలిస్తున్న ప్రదేశాలను కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఆమె మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పట్టణ ప్రగతి పేరుతో చెత్త, ఇతర వ్యర్థాలతో పేరుకుపోయిన ప్రదేశాలను శుభ్రం చేశామన్నారు.