మూలాలు గుర్తించకపోతే ముప్పు తప్పదు.. వంశపారపర్యంగా 50 శాతం వచ్చే అవకాశంజీవనశైలి, వాతావరణ పరిస్థితుల కారణంగా మరో 50 శాతం చాన్స్
సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ): కొందరికి చల్లటి గాలి పడదు. కొందరికి దుమ్ము, ధూళి పడదు. మరికొందరికి కొన్ని రకాల ఆహార పదార్థాలు పడవు. కొందరికి ఏ చిన్న క్రిమీ కీటకం ఒంటిపైన వాలినా ఒళ్లంతా దురద, దద్దుర్లు వచ్చేస్తాయి. కొందరిలో అలర్జీలు తాత్కాలికంగా ఉంటే.. మరికొందరిలో దీర్ఘకాలంగా జీవితాంతం ఉండి, వారిని నీడలా వెంటాడుతుంటాయి. కేవలం మన రాష్ట్రంలోనే కోటిన్నర మంది వివిధ రకాల అలర్జీలతో బాధపడుతున్నారు. అయితే అలర్జీలు సర్వసాధారణమంటూ చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు.. కానీ, కొన్ని రకాల ఎలర్జీలు ప్రాణాల మీదకు తీసుకొస్తాయంటున్నారు వైద్యనిపుణులు.
అలర్జీ అంటే..
పర్యావరణంలోని డస్ట్మైట్లు, పుప్పొడి, ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్, కొన్ని రకాల ఆహార పదార్థాలు.. తదితర ఎలర్జన్లకు, మానవ శరీరంలోని రక్షణ వ్యవస్థలో ఉండే IgG, IgM, IgA, IgD, IgE ల మధ్య నిరంతరం పోరాటం జరుగుతుంటుంది. ఈ క్రమంలో ఎలర్జన్లకు IgE యాంటి బాడీలకు మధ్య జరిగే పోరాటాల వల్ల ఏర్పడే ఫలితాన్నే IgE మీడియేటడ్ అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు. ఈ అలర్జిక్ ఇన్ఫ్లమేషన్లు రెండు రకాలు. ఒకటి ఎక్యూట్ ఇన్ఫ్లమేషన్. ఇది త్వరగా తగ్గిపోతుంది. రెండవది శ్వాస వ్యవస్థలో ఎలర్జీల వల్ల ఏర్పడుతుంది. దీనిని ‘క్రానిక్ ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్’ అంటారు. అంటే ఇది దీర్ఘకాలం ఉంటుంది. ఇది కొంత మందిలో వయస్సు పెరిగే కొద్దీ పూర్తిగా తగ్గిపోతుంది. కొంత కాలం తరువాత మళ్లీ శ్వాస వ్యవస్థలోని ఏ భాగంలోనైనా ఏర్పడవచ్చు. ఈ అక్యూట్ ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అనేది ముక్కులో మొదలై.. ఊడల మర్రిలా శరీరంలోని ఇతర భాగాలతో పాటు ఊపిరితిత్తుల వరకు వ్యాపించి శ్వాస వ్యవస్థ మొత్తాన్ని దెబ్బతీస్తుంది.
అలర్జీలు రావడానికి గల కారణాలు..?
అలర్జీ అనేది అంటువ్యాధి కాదు. అలర్జీలు రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి వంశపారపర్యంగా వస్తుంది. రెండవది వాతావరణంలో కలిగే మార్పులు, కాలుష్యం, కలుషితమైన ఆహారం.. తదితర బాహ్య కారణాలు కూడా అలర్జీలకు కారణంగా చెప్పవచ్చు.
ఎన్నిరకాల అలర్జీలు ఉంటాయి..అవి ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉంటుంది..?
అలర్జీలు 100కు పైగా ఉన్నాయి. కానీ, అందులో ప్రధానంగా ఎక్కువ మందిలో కనిపించేవి 12 రకాల అలర్జీలు. ఈ అలర్జీలు శరీరంలో రక్త ప్రసరణ ఉన్న అన్ని చోట్ల వస్తాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో అలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అక్కడ అలర్జీ ఏర్పడితే మూసగొట్టాలు మూసుకుపోయి పొడిదగ్గు, ఆ యసం వస్తుంది. దీనిని ఆస్తమా అని కూడా అంటారు. అదే ముక్కులో అలర్జీ ఏర్పడితే తర చూ తుమ్ములు వస్తాయి. చికిత్స తీసుకున్నా వస్తుంది. దీనినే అలర్జిక్ రైనటిస్ అంటారు. కంటిలో వస్తే కన్ను దురద వచ్చి కన్ను ఎర్రగా మారి నీరు కారుతుంది. దీనిని ఎలర్జిక్ కంజెంటవేటిస్ అంటారు. చర్మంపై అలర్జీ వస్తే చర్మంపై దురద, దద్దుర్లు వస్తా యి. సైనస్లో ఏర్పడితే సైనసైటిస్ వస్తుంది. అలర్జిక్ అంజియోఎడిమా వల్ల పెదవులు, ముక్కు, కళ్లు వాయడం జరుగుతుంది.
అలర్జీని గుర్తించడం ఎలా..?
తరచూ దగ్గు రావడం, ఆయసం రావడం, ముక్కు కారడం, చర్మంపై దద్దుర్లు, దురద, పెదవులు, కళ్లు, ముక్కు వాయడం వంటివి జరిగితే వాటిని అలర్జీ సంకేతాలుగా అనుమానించాలి. ‘మాడిఫైడ్ అలర్జన్ స్కిన్ ప్రిక్ టెస్ట్’ ద్వారా రోగికి అలర్జీ ఉందా..! ఉంటే అది ఏ రకమైన అలర్జీ అనే మూల కారణాన్ని తెలుసుకోవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.