హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): సెలవుండదు. పండుగ పబ్బం ఏమీ ఉండవు. పనొక్కటే లోకం. ఇంటి పని ఒక్కటే
జీవనాధారం. ఒళ్లు హూనమయ్యేంత పని చేసినా తప్పని అవమానాలు, అవహేళనలు. పని గంటలకు లెక్కలు గడుతూ జీతంలో కోతలు. ఇదేమంటే దాడులు. కుటుంబ పోషణకు, పొట్టకూటికి, పిల్లల చదువుకు వాటన్నింటినీ పంటి బిగువునే భరించాలి ఇదీ ఇంటి పనిమనుషుల జీవనస్థితి. గురువారం అంతర్జాతీయ డొమెస్టిక్ వర్కర్స్ డేను
పురస్కరించుకొని ప్రత్యేక కథనమిది.
మన దేశంలో మొత్తం 5 కోట్ల మంది గృహకార్మికులు ఉంటారని అంచనా. తెలంగాణలో 8-10 లక్షల మంది ఉంటారని, ఒక్క హైదరాబాద్‌లోనే 4-5లక్షల మంది వరకు ఉంటారని సమాచారం. వీరి పరిస్థితిపై ఢిల్లీ లేబర్ డిపార్ట్మెంట్, ఐఐఎం అహ్మదాబాద్, పుణె, తమిళనాడుకు చెందిన పలు విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు అధ్యయనం చేశాయి. ఇందులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. గృహ కార్మికుల్లో 75 శాతం కంటే ఎక్కువ మంది ఆడవాళ్లే. పురుషులు తోట పని, సెక్యూరిటీ గార్డు తదితర పనులు చేస్తుండగా, గృహానికి సంబంధించిన అనేక పనులు మహిళలే నిర్వర్తిస్తున్నారు. వీరు నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేలు సంపాదిస్తున్నారట. పార్ట్‌టైమ్ చేసేవాళ్లు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు పొందుతున్నారట.
గృహ కార్మికుల సమస్యలివీ
ఎక్కువ పని. తకువ జీతం. వేతనంపై నియంత్రణ లేదు. నైపుణ్యం లేని లేదా
సెమీ-సిల్డ్ కార్మికులకు కనీస వేతనాలకంటే చాలా తకువగా చెల్లింపులు.
ఇంటి పనికి నిర్ణీత సమయం లేదు.
గృహ కార్మికుల్లో అత్యధికులు రోజుకు కనీసం 15 గంటలు, వారానికి 7 రోజులు పని చేస్తున్నారు. పార్ట్ టైమ్ వరర్లు దాదాపు 8-10 గంటల పాటు, 3-4 వేర్వేరు ఇండ్లలో
పని చేస్తున్నారు.
తరచూ అవమానాలు. ఇంట్లో ఏదైనా కనిపించకపోతే ముందుగా అనుమానించేది గృహకార్మికులనే.
డొమెస్టిక్ వర్కర్స్ డిమాండ్లు
అంతర్జాతీయ కార్మికుల సంస్థ(ఐఎల్వో) సూచనలకు అనుగుణంగా గృహ కార్మికులకు ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించాలి. కనీస వేతన రక్షణ కల్పించాలి.
గృహ కార్మికులకు నైపుణ్య శిక్షణ అందించాలి.