బంజారాహిల్స్,జూన్ 15: ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం స్థలాలను జీహెచ్ఎంసీకి అప్పగించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ బుధవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్‌ను కోరారు. బంజారాహిల్స్‌లోని ప్రభుత్వ పాఠశాలలో మన బస్తీ-మన బడి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని పంజాగుట్ట ప్రతాప్‌నగర్‌లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి స్థలం సిద్ధంగా ఉన్నదని, స్థలానికి సంబంధించి ఎన్వోసీ ఇస్తే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. బంజారాహిల్స్‌లోని నూర్‌నగర్.
ఇబ్రహీంనగర్‌లో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం స్థలం అందుబాటులో ఉన్నదని, ఈ స్థలాన్ని పంచనామా చేసి జీహెచ్ఎంసీకి అప్పగించాలని కోరారు. అదే విధంగా.. జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని పలుబస్తీల్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం స్థలాలకు సంబంధించిన ఎన్వోసీలు ఇవ్వాలని కోరారు. బాబునాయుడునగర్, దుర్గాభవానీనగర్, బసవతారకం నగర్, ఛత్రపతిశివాజీనగర్, జ్ఞానీ జైల్‌సింగ్ నగర్, పటేల్‌నగర్ తదితర బస్తీల్లో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని, రెవెన్యూ శాఖ నుంచి ఎన్వోసీ వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్.. స్థలాలకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను ఇవ్వాలని సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారిని ఆదేశించారు.