బంజారాహిల్స్, జూన్ 15 : బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆవరణలో ఖరీదైన కాపర్ బండిల్స్‌ను చోరీ చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ సుదర్శన్, ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు వివరాలు వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నం.12లో కమాండ్ కంట్రోల్ భవనాన్ని షాపూర్ జీ పల్లాంజీ నిర్మాణ సంస్థ చేపడుతున్నది. అందులో మద్యప్రదేశ్‌కు చెందిన సోనూఖాన్(34) మినీ అంబులెన్స్ వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నం.11లోని గౌరీశంకర్‌కాలనీలో నివాసముండే అస్సాంవాసి సౌరభ్ బిశ్వాస్(24), నాంపల్లిలో నివాసముండే ఒరిస్సాకు చెందిన వికాస్ రంజన్ బెహ్రా(19) సెక్యూరిటీగార్డులుగా పనిచేస్తున్నారు.
వీరితో పాటు అదే సైట్లో పనిచేస్తున్న శంకర్కుమార్తో కలిసి సైట్లో భద్రపర్చిన కాపర్ బండిల్స్‌ను చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. రోజుకు కొన్ని బండిల్స్‌ను తస్కరించి అంబులెన్స్ ద్వారా బయటకు తరలించారు. వీటిని బల్కంపేట, ఎన్బీటీనగర్, భోలక్‌పూర్ తదితర ప్రాంతాల్లోని స్క్రాప్ దుకాణాల్లో విక్రయించారు. బండిల్స్ మాయమైన విషయాన్ని గుర్తించిన సంస్థ సైట్ ఇన్చార్జి పింగళి నరేందర్ రూ.30లక్షల విలువైన 38 బండిల్స్ చోరీకి గురయ్యాయంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీల సాయంతో నిందితులను గుర్తించారు. సోనూఖాన్, సౌరభ్ బిశ్వాస్, వికాస్‌రంజన్ బెహ్రాలను అరెస్ట్ చేసిన పోలీసులు స్క్రాప్ దుకాణాల్లో విక్రయించిన 38 కాపర్ బండిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు శంకర్‌కుమార్ పరారీలో ఉన్నాడు.