ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 15 : నాలుగేండ్ల వయసులోనే తన జ్ఞాపక శక్తితో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్తవ్య నాళ్ళచెరు చోటు దక్కించుకున్నాడు. ప్రవాస భారతీయ దంపతులైన శరణ్, నిహారిక దంపతుల కుమారుడైన స్తవ్య ప్రస్తుతం అమెరికాలోని వర్జీనియాలో ప్రీస్కూల్ చదువుతున్నాడు. చిన్ననాటి నుంచి తన మేథస్సుతో అందరినీ అబ్బురపరుస్తుండటంతో తల్లిదండ్రులు అతడి ప్రతిభను గుర్తించి, నగరంలోని ఇంప్రూవ్ మెమోరీ ఇనిస్టిట్యూట్‌లో ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇప్పించారు. వేసవి సెలవుల్లో నగరానికి వచ్చిన స్తవ్య అమెరికా ఖండంలోని 50 రాష్ర్టాలను మ్యాప్‌లో చూసి గుర్తించి, వాటి పేర్లను కేవలం 30 సెకన్ల వ్యవధిలో చెప్పి రికార్డు సృష్టించాడు. ప్రతిభను తార్నాకలోని సంస్థ కార్యాలయంలో పరీక్షించి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి సర్టిఫికెట్, జ్ఞాపిక, మెడల్, బ్యాడ్జిలను అందజేసి అభినందించారు. దీంతో పాటు సూపర్ కిడ్స్ రికార్డ్స్‌లో కూడా స్తవ్య చోటు దక్కించుకున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మెమోరీ ట్రైనర్ డాక్టర్ అనిత కరుణ్, ఇంప్రూవ్ మెమోరీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కరుణ్‌కుమార్, చిన్నారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.