బడంగ్‌పేట, జూన్15 : పుట్టిన రోజులకు, శుభకార్యాలు వచ్చినప్పుడు జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి దాతలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు సహకరించాలని విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. గ్రంథాలయాలను విజ్ఞాన గనిగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.4.30 కోట్లతో నిర్మాణం చేసిన నూతన గ్రంథాలయ భవనాన్ని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, కేంద్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీలు వాణి దేవి, బొగ్గారపు దయానంద్ గుప్తా, శ్రీధర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండు రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, స్థానిక మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, మీర్‌పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్లు ఇబ్రాం శేఖర్, తీగల విక్రమ్‌రెడ్డి, కార్పొరేటర్లతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభోత్సవం చేశారు.
జిల్లా గ్రంథాలయ నూతన భవనానికి మాజీ మంత్రి ఇంద్రారెడ్డి స్మారక భవనంగా నామకరణం చేశారు. గ్రంథాలయ ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. నూతన హంగులతో నిర్మించిన గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తకాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోటీ పరీక్షల పుస్తకాల కోసం రూ. 10 లక్షలు కేటాయించినట్లు చెప్పారు.గ్రంథాలయం ఏర్పాటుకు సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. మంత్రి పిలుపు మేరకు మేయర్లు చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, దుర్గా దీప్లాల్, చౌహాన్, డిప్యూటీ మేయర్లు ఇబ్రాం శేఖర్, తీగల విక్రమ్‌రెడ్డి, కార్పొరేటర్ యాతం పవన్ గ్రంథాలయానికి ఆర్థిక సహాయం అందిస్తున్నందుకు మంత్రి వారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు సూర్ణగంటి అర్జున్, శోభా ఆనంద్ రెడ్డి, బీమిడి స్వప్న జంగారెడ్డి, పెద్ద బావి శ్రీనివాస్‌రెడ్డి, దర్శన్ రెడ్డి, లిక్కి మమత కృష్ణారెడ్డి, రాళ్లగూడెం సంతోషి శ్రీనివాస్‌రెడ్డి, బండారు మనోహర్, ఎర్ర మహేశ్వరి జైహింద్, శ్రీధర్ రెడ్డి, సంరెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి, బోయపల్లి దీపిక శేఖర్‌రెడ్డి, అమిత శ్రీశైలం చారి, మాధురి వీరకర్ణారెడ్డి, జనిగ భారతమ్మ, ఏనుగు రాంరెడ్డి, ముత్యాల లలిత కృష్ణ, కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, గ్రంథాలయ తదితరులు ఉన్నారు.
33 జిల్లాల్లో గ్రంథాలయాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ 33 జిల్లాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయిస్తున్నారని రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ శ్రీధర్ అన్నారు. నూతన హంగులతో గ్రంథాలయాలకు నూతన భవనాలను నిర్మాణం చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 గ్రంథాలయాలు ఉన్నాయని, జీహెచ్ఎంసీ పరిధిలో 40 గ్రంథాలయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
– శ్రీధర్, రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్