జూబ్లీహిల్స్, జూన్15 : మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, ఎంఎస్ఎంఈలతో స్టార్టప్ రంగాల్లో నిలదొక్కుకోవాలని కేంద్ర సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాణయణ్ రాణే పేర్కొన్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు కేంద్రం ప్రత్యేక మం త్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంతో పాటు ఎంఎస్ఎంఈలతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. బుధవారం యూసుఫ్‌గూడ నిమ్స్‌మేలో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వర్క్‌షాప్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఇద్దరు మం త్రులు మాట్లాడుతూ.. స్వయం ఉపాధి కోసం ఇచ్చే రుణాలను మహిళలకు సద్వినియోగం చేసుకుని తమతోపాటు మరో పదిమందికి ఉపాధి కల్పించాలని సూచించారు.
రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. బ్యాంకులు గతంలో గ్రూపులకు రూ.1 లక్ష రుణం ఇచ్చేందుకు కూడా నిరాకరించాయని,నేడు కేంద్ర ప్రభుత్వమే పూచీకత్తుగా మహిళా సంఘాలకు రూ.10 నుంచి రూ.20 లక్షల వరకు రుణాలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ సౌత్‌జోన్ డైరెక్టర్ పేరాల శేఖర్‌రావు, నిమ్స్‌మే డైరెక్టర్ జనరల్ గ్లోరీ స్వరూప పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్లు అందజేశారు.