అల్వాల్, జూన్ 15: వానకాలం వచ్చిందంటే అల్వాల్ ప్రజలకు వెన్నులో వణుకే. డివిజన్లోని ఓల్డ్ అల్వాల్‌లోని కొన్ని ప్రాంతాలు మినహా టెంపుల్ అల్వాల్ లోతట్టు ప్రాంతం కావడంతో ముంపు తీవ్రత అధికంగా ఉంటుం ది. దీంతో కాలనీలన్నీ జలమయమవుతాయి. సుమారు మూడు నెలలు అల్వాల్ ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. దాదాపు వర్షాలు ప్రారంభం కావడంతో ఈసారి కూడా అలాంటి పరిస్థితులే మళ్లీ పునరావృతమవుతాయని భయపడున్న ప్రజలకు త్వరలోనే ఉపశమనం కలగనుంది.
ఇదీ సమస్య..
అల్వాల్‌లోని కొత్త చెరువు ఏటా వానకాలంలో నిండి అలుగు పారుతుంటుంది. అయితే ఈ వర్షం నీరంతా రెడ్డిఎన్క్లేవ్ నుంచి శ్రీబేకరీ మీదుగా దిగువనున్న మోత్కులకుంట చెరువులో కలుస్తుంది. అయితే చెరువు నుంచి వచ్చే నీటి ప్రవాహానికి ప్రస్తుతం ఉన్న కాల్వలు సరిపోవడం లేదు. ఫలితంగా భారీ వర్షం పడిందంటే వరదనీరంతా కాల్వల నుంచి పొంగి రెడ్డి ఎన్క్లేవ్, శ్రీబేకరీ నుంచి మోత్కులకుంట చెరువుకు వెళ్లే దారులన్నీ నదులను తలపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజల ఇండ్లల్లోకి కూడా నీరు చేరుతోంది. దీంతో స్థానికులు ఏటా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రూ.2.5 కోట్లతో పనులు షురూ..
డివిజన్లో ముంపు సమస్యను అధిగమించడంపై ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, అల్వాల్ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి చర్యలు చేపట్టారు. సమస్యను తీరడానికి బాక్స్ డ్రైన్ వ్యవస్థ ఒక్కటే పరిష్కారమని భావించారు. అల్వాల్‌లో ప్రధాన సమస్యగా ఉన్న శ్రీబేకరీ రోడ్డులో చేపట్టాలంటే వాహ నాలను దారి మళ్లించాలి. ఈవిషయమై ఎమ్మెల్యే పోలీసులతో స్వయంగా మాట్లాడి వాహనాలను దారి మళ్లించేలా చూడాలన్నారు. కరీంనగర్ హైవే మీద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం నుంచి ఐజీ బొమ్మ వరకు వెళ్లే దారిలో వాహనాలను మరో మార్గంలో మళ్లించారు. దీంతో సుమారు రూ.2.5 కోట్ల నిధులు వెచ్చించి బాక్స్ డ్రైన్ పనులు ప్రారంభించారు. తొలిదశలో శ్రీబేకరీ నుంచి మోత్కులకుంట చెరువు వరకు పనులు చేపట్టారు. 15 నుంచి నెలరోజుల్లో పూర్తిచేయాలని గుత్తేదారును ఎమ్మెల్యే ఆదేశించారు. ఎట్టకేలకు పనులు ప్రారంభం కావడంతో త్వరలోనే తమ సమస్య తీరనుందని డివిజన్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.