సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తేతెలంగాణ) : కుటుం బం, పిల్లల ఎదుగుదల కోసం జీవితాంతం కష్టపడుతారు తల్లిదండ్రులు. పిల్లలు పెద్దయ్యాక, స్థిరపడిన తర్వాత వృద్ధాప్యానికి చేరిన తల్లిదండ్రులను కన్నపేగులు పట్టించుకోవడం లేదు. వారి ఆరోగ్యం, ఆలనాపాలన చూడకపోవడమే కాకుండా సూటిపోటి మాటలంటూ వారిని వేదనకు గురిచేస్తున్నారు. దీనివల్ల వృద్ధ దంపతులు తీవ్రంగా కుంగిపోతూ అనారోగ్యం పాలవుతున్నారని హెల్ప్ ఏజ్ ఇండియా జాతీయ నివేదిక వెల్లడించింది. కుటుంబసభ్యుల సూటిపోటి మాటలతో 53 శాతం వృద్ధులు వేదనకు గురవుతున్నారని, మరో 60 శాతం నిరాదరణకు గురవుతున్నారని వెల్లడించింది. హెల్ప్ ఏజ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం హిమాయత్‌నగర్‌లోని కామ్రేడ్ సత్యనారాయణరెడ్డి భవన్లో ‘అంతరాన్ని తగ్గించండి..వృద్ధుల అవసరాలు అర్థం చేసుకోండి’ అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ నివేదికను పలువురు వక్తలు హాజరై ఆవిష్కరించి మాట్లాడారు.
స్వేచ్ఛ కాదు..ఉమ్మడి కుటుంబాలే ఉత్తమం
ఉమ్మడి కుటుంబాలే ఉత్తమం..పెద్దలను అవమానించకండి.. ఆదరించి ఆప్యాయతను పంచండి అని.. ప్ర పంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ స్టేట్ లీగల్‌సెల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ గోవర్ధన్‌రెడ్డి సూచించారు. మాటలు, నడక నేర్పడం నుంచి మొదలుకొని జీవితగమనాన్ని రూపొందించేందుకు ప్రతినిత్యం తల్లిదండ్రులు కష్టపడిన విధానానికి ఎన్నటికీ వెలకట్టలేమని.. వారు చూపించే చను వు, చొరవ, ప్రేమ, ఆప్యాయతలు ఎవ్వరూ ఇవ్వలేరని స్పష్టం చేశారు.
కుటుంబంలో వృద్ధులు ఉంటే.. వారిద్వారా జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు, విజ్ఞానాన్ని తెలుసుకోవచ్చన్నారు. కుటుంబంలోని పెద్దలను గౌరవించకుండా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు పంపిం చే ఆలోచన ఏమాత్రం భవిష్యత్తు తరాలకు మంచిది కాదని హితవుపలికారు. తరాలను (రూట్స్) మరిచిపోనివారే చరిత్రలో ఉత్తములుగా నిలుస్తారని, కుటుంబీకుల్ని గౌరవించకపోతే..గుర్తించకపోతే.. మనల్ని మనమే అవమానపర్చుకున్నవారమవుతామని గుర్తుచేశారు. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న సంతోషం, నేడు చిన్న కుటుంబాల్లో ఉండటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం వారానికి ఒకసారైనా తల్లిదండ్రులు, అమ్మమ్మ, నానమ్మ, తాతలు, బంధువులతో మాట్లాడటానికి యత్నించాలన్నారు. కార్యక్రమంలో ఉప్పల గోపాలరావు, ఆసరా సెం ట్రల్ కమిటీ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు డాక్టర్ నాగేశ్వర్రావు, టెస్కాన్ అధ్యక్షుడు పి.రామచంద్రయ్య, స్టేట్ కౌన్సిల్ మెంబర్ మోహన్‌రెడ్డి, ఎస్.శ్రీధర్, హెల్ప్‌ఏజ్ ఇండియా ప్రతినిధులు రజామహ్మద్,శ్యామ్‌కుమార్, సుభాకర్‌రెడ్డి, ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
ఇలా ఫిర్యాదు చేయొచ్చు
సమాజంలో, కుటుంబసభ్యుల ద్వారా వేధింపులకు గురవుతే వృద్ధులు నేరుగా హెల్ప్ ఏజ్ ఇండియా వయోవృద్ధుల సహాయ కేంద్రం 18001801253 నంబర్‌ను సంప్రదించొచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే పిల్లలకు అవగాహన కల్పించడంతోపాటు మానవతా విలువలు పెంపొందించేలా చేస్తారు.
చట్టం అమలు చేస్తే మేలు
తల్లిదండ్రుల సంక్షేమం కోరి 2007లో కేంద్రం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. 2011లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని అడాప్ట్ చేసుకుంది. దీన్ని అమలు చేస్తే చాలావరకు వృద్ధుల సమస్యలు తీరుతాయి. కుటుంబంలో ఒకరినొకరు గౌరవించుకోవాలి. లేదంటే భవిష్యత్తు తరాలు ఇంకా నిలకడలేని స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. – సుభాకర్‌రెడ్డి, హెల్ప్ ఏజ్ ఇండియా ప్రతినిధి
వృద్ధులను ఆదుకుంటున్నాను..
చుట్టుపక్కల వృద్ధులను ఆదుకుంటున్నాను..చాలామంది వృద్ధుల పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు. ప్రతిరోజు వారిని పలకరించడం, ఆరోగ్యం గురించి వాకబు చేస్తుంటాను. ఎప్పుడైనా ఆరోగ్యం సహకరించకున్నా వైద్యం కోసం డబ్బులు సమకూర్చుతాను. 35 శాతం వృద్ధులు సంతోషంగా ఉండటానికి కారణం ప్రభుత్వమిచ్చే పింఛన్లే అనుకుంటున్నాను.
– విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ ఆసరా కమిటీ మెంబర్