మినీ ఇండియాగా పేరొందిన మహానగరంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ,విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. చక్కటి ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, మౌలిక వసతులు అందుబాటులో ఉంటుండడంతో అనేక కంపెనీలు నగరబాట పడుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు తమ పరిశ్రమలు నెలకొల్పగా, మరికొన్ని ప్రతియేటా విస్తరిస్తున్నాయి. ఐటీతోపాటు ఫార్మా, తయారీ, రియల్ ఎస్టేట్, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో నగరానికి పెట్టుబడుల వరద పారుతోంది. ఐటీ దిగ్గజ కంపెనీలైన మైక్రోసాప్ట్, అమెజాన్ వంటివి డేటా సెంటర్ల కోసమే రూ.35 వేల కోట్ల పెట్టుబడి పెట్టగా, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి విదేశీ పర్యటన తర్వాత పెట్టుబడులు జోరు మరింత పెరిగింది. 2 రోజుల కిత్రం రాజేష్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఒకేసారి రూ.24వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందం చేసుకోగా, మంగళవారం అమెరికా చెందిన జాన్సన్ కంట్రోల్స్ తన పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నగరంలో ఏర్పాటు చేసింది. వారం, పదిరోజుల వ్యవధిలోనే పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలు మొదలుపెట్టాయి. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరం రోజు రోజుకు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ, వ్యాపార, వాణిజ్యాలకు, దేశీ, విదేశీ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా అవతరిస్తున్నది. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్ మహానగరం చాలా అనువైన ప్రాంతంగా మారింది. ఐటీ, ఫార్మా, తయారీ, రియల్ ఎస్టేట్, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో ఇటీవల నగరానికి పెట్టుబడుల వరద పారుతోంది. భౌగోళికంగా ఎంతో సురక్షితమైన ప్రాంతం కావడంతో ప్రపంచం ఐటీ దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు డేటా సెంటర్ల కోసం రూ.35 వేల కోట్ల పెట్టుబడిని పెట్టగా, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఇటీవల చేపట్టిన విదేశీ పర్యటన తర్వాత పెట్టుబడులు మరింతగా పెరిగాయి.
ఇందుకు నిదర్శనం రెండు రోజుల కిత్రం రాజేష్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఒకేసారి రూ.24వేల కోట్ల పెట్టుబడిని పెడుతూ ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చుకుంది. ఇది జరిగిన మరుసటి రోజే 135 ఏళ్ల చరిత్ర ఉన్న అమెరికన్ కంపెనీ జాన్సన్ కంట్రోల్స్ తన పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నగరంలో ఏర్పాటు చేసింది. అంతకు ముందు జెఫ్ గ్రూపు సైతం సుమారు రూ.322 కోట్ల పెట్టుబడి విస్తరణ కార్యకలాపాలను చేపట్టింది. ఇలా వారం, పది రోజుల వ్యవధిలోనే పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను మొదలు పెట్టాయి.
క్యూ కడుతున్న ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు..
భౌగోళికంగా హైదరాబాద్ అత్యంత అనుకూలమైన వ్యాపార, వాణిజ్య వర్గాలు గుర్తించాయి. అదే విధంగా రియల్ ఎస్టేట్ రంగంలోనూ దేశీయ కంపెనీలు సైతం వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా పెట్టుబడి పెట్టిన కంపెనీల్లో ఒకటైన జాన్సన్ కంట్రోల్స్ కంపెనీకి 135 ఏళ్ల చరిత్ర ఉంది. భవన నిర్మాణాలతో పాటు భద్రతా పరమైన ఉపకరణాలను తయారు చేసి 150కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. అలాంటి కంపెనీ నగరంలోని హైటెక్ సిటీలో ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు త్వరలో మరో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు ప్రకంటించారు. ఐటీ రంగంలో ఇప్పటికే ప్రపచం ప్రఖ్యాత కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, ఆపిల్, ఓరాకిల్ వంటి కంపెనీలు తమ కార్యాలయాలను నగరంలో ఏర్పాటు చేశాయి. ఐటీ తర్వాత ఫార్మా, లైఫ్ సైన్స్‌తో పాటు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ విభాగంలోనూ పలు కంపెనీలు నగరంలో పెట్టుబడులు పెడుతున్నాయి.
వ్యాక్సిన్ కేపిటల్‌గా హైదరాబాద్…
ప్రపంచంలోని మొత్తం టీకాల ఉత్పత్తిలో మూడో వంతు హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతోంది. ప్రపంచానికే వ్యాక్సిన్ కేపిటల్‌గా ఎదిగింది. ఐటీ తర్వాత ఫార్మా, లైఫ్ సైన్స్ రంగాల్లోనూ నగరంలో అత్యంత ఆకర్షణీయ ప్రాంతంగా మారింది. దీని వల్లే హైదరాబాద్‌కు ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు వస్తున్నాయని ఆయా రంగాలకు చెందిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నగర శివారులోని జీనోమ్ వ్యాలీలో ఇటీవల కాలంలో దేశీయ కంపెనీలే కాకుండా విదేశీ కంపెనీలు సైతం పెట్టుబడులు పెట్టాయి. దానికి అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తూ ఉండటంతో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన నగరంగా హైదరాబాద్‌ను పెట్టుబడిదారులు గుర్తిస్తున్నారు.
యూకే, దావోస్ పర్యటనలతో రూ.4200 కోట్ల పెట్టుబడులు…
పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా యూకే, దావోస్ పర్యటనలకు వెళ్లిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పది రోజుల వ్యవధిలో పలు కంపెనీల నుంచి సుమారు రూ.4200 కోట్లను పెట్టుబడులుగా పెట్టేందుకు ఆయా కంపెనీ ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత నగరంలో దేశ, విదేశీల కంపెనీలు నగరంలో తమ కార్యాలయాల విస్తరణ కార్యకలాపాలను చేపడుతుండగా, కొత్తగా పలు కంపెనీలు పెట్టుబడులతో నగరానికి వస్తున్నాయి.