ఎర్రగడ్డ, జూన్ 14: కార్పొరేట్ స్థాయిలో స్కూల్ భవనం.. అంకిత భావం తో పని చేస్తున్న అధ్యాపకులు.. ఆంగ్ల మాధ్యమంలో నాణ్యత గల విద్యాబోధన.. ఇదీ బోరబండ పెద్దమ్మనగర్లోని నాట్కో ప్రభుత్వ పాఠశాల ఘనత. ఇంకేముంది.. తమ పిల్లలను ఇక్కడ చదివించటానికి స్థానికంగా పిల్లల తల్లిదండ్రులు పోటీ పడుతుంటారు. ఈ స్కూల్లో 6-10 తరగతులున్నాయి. అయితే, ఏటా 6వ తరగతిలో తమ పిల్లలను చేర్పించటానికి తల్లిదండ్రులు ఆసక్తిని కనబర్చుతుంటారు. ఈ సారి ప్రవేశాలకు అత్యధిక డిమాండ్ ఏర్పడింది. 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది.
కేవలం ఈ రెండు రోజుల్లోనే వందల సంఖ్యలో దరఖాస్తులు రావటం విశేషం. తమ పిల్లల దరఖాస్తులను అందజేయటానికి వచ్చిన తల్లిదండ్రులు, సంబంధీకులతో మంగళవారం పాఠశాల ప్రాంగణం కిక్కిరిసింది. ఒక దశలో దరఖాస్తుల కౌంటర్ వద్ద తోపులాట చోటు చేసుకున్నది. ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుకుని ఉత్తీర్ణులైన విద్యార్థులకు మాత్రమే 6వ తరగతిలో ప్రవేశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు యాదగిరి తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 200 మంది పిల్లలకు ప్రవేశాలు కల్పించామన్నారు. అయితే, 6వ తరగతిలో మొత్తం సీట్ల సంఖ్య 500 వరకు ఉంటుందని చెప్పారు.