సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ): భారత్- దక్షిణాఫ్రికా జట్ల వన్డే క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆశపడిన ఓ యువకుడు ట్విట్టర్లో టికెట్లు ఉన్నాయంటూ వచ్చిన ఓ పోస్టుకు స్పందించి, రూ. 2.62 లక్షలు పోగొట్టుకున్నాడు. రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం విశాఖపట్నంలో జరిగే వన్డే క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి టికెట్లు ఉన్నాయంటూ ఈనెల 12న ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు. ఈ పోస్టును మన్సూరాబాద్‌కు చెందిన విద్యార్థి(20) చూశాడు. దీంతో ఆ విద్యార్థి అతడికి ఫోన్ చేయగా, మెసేజ్ చేయమని సూచించాడు. మెసేజ్ చేయగా అతడు.. తన పేరు సిరిగిడి ప్రవీణ్ అని, తాను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడుకునని చాటింగ్‌లో వివరించాడు. తన వద్ద టికెట్లు ఉన్నాయంటూ పలు ధఫాలుగా రూ. 2.62 లక్షలు ఆన్లైన్ ద్వారా వేయించుకున్న నేరగాళ్లు ఆ తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన విద్యార్థి రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.