సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): బిట్‌కాయిన్ ట్రేడింగ్‌లో భారీ లాభాలు ఇప్పిస్తామంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ఒక మహిళా న్యాయవాదికి రూ. 55 లక్షలు, మరో ఘటనలో హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి రూ. 10 లక్షలు టోకరా వేశారు. ఆయా ఘటనలపై బాధితులు మంగళవారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
వారాసిగూడకు చెందిన బాధితురాలి ఫోన్ నంబర్‌ను బిట్‌కాయిన్ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసింది. ఆ తర్వాత జాక్ అనే వ్యక్తి బిట్‌కాయిన్ ట్రేడింగ్ చాలా బాగా నడుస్తుందని, అందులో మీరు పెట్టుబడి పెట్టండి.. మేము ట్రేడింగ్ చేస్తాం.. వచ్చిన లాభాల్లో 20 శాతం మాకు ఇవ్వాలంటూ సూచించాడు. మొదట తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టించారు. బాధితురాలికి డబ్బు ఇచ్చారు. తర్వాత వారి మాటలు నమ్మిన బాధితురాలు రూ. 55 లక్షలు పెట్టుబడిగా పెట్టింది. పెట్టిన డబ్బులు స్క్రీన్‌పై కనిపిస్తున్నా, డ్రా చేసుకునే వెసులుబాటు మాత్రం లేదు. ఇంకా డబ్బు పెట్టాలంటూ నేరగాళ్లు సూచిస్తూ వెళ్లారు. దీంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితురాలు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి వెబ్ లింక్ ద్వారా బిట్‌కాయిన్ గ్రూప్‌లో చేరాడు. అక్కడ లాభాలు ఇప్పిస్తామంటూ అందులో ఉన్న వారు చాటింగ్ చేయడంతో వారి మాటలు నమ్మిన బాధితుడు రూ. 10 లక్షలు పెట్టుబడిగా పెట్టి మోసపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.