హయత్‌నగర్, జూన్ 12: హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని బాతుల చెరువు కింది షిర్డీసాయినగర్ కాలనీలో వరద నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ట్రంక్‌లైన్ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ బురద కాలువలోనే కాంక్రీట్‌ను పోస్తూ నిర్మాణ పనులు చేపట్టారని, దీంతో సిమెంట్ మొత్తం అడుగుకు వెళ్లి కంకర తేలిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ అంశంపై హయత్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతీ దివాకర్ స్పందిస్తూ.. బాతుల చెరువు కింద కాలనీలకు ట్రంక్‌లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. బురద కాలువలో కాంక్రీట్ వేస్తున్నట్లు తన దృష్టికి ఇప్పడే వచ్చిందన్నారు. ఎస్ఎన్డీపీ ఈఈ కృష్ణయ్య దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ట్రంక్‌లైన్ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.