స్థానిక సమస్యలు..ప్రజల అవసరాలు తెలుసుకునేందుకు గ్రేటర్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ పర్యటనలు ప్రారంభించారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళడంతోపాటు కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. ‘ఇంటింటికి మాగంటి’ పేరుతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ పాదయాత్ర ప్రారంభించగా, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రతివారం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఆదివారం ‘ఎమ్మెల్యే కేర్స్’ పేరిట వినూత్న కార్యక్రమానికి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ శ్రీకారం చుట్టారు. క్యూఆర్ కోడ్ ద్వారా సమస్యలు విన్నవించేందుకు గాంధీనగర్ డివిజన్లో అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాల్లో క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు అతికించారు. మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేసి సమస్యలు తెలియజేయవచ్చు. ఈ విధానం అమలు రాష్ట్రంలోనే ప్రథమం.