సిటీబ్యూరో, జూన్ 12(నమస్తే తెలంగాణ): నంబర్ ప్లేట్ సక్రమంగా లేని వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. టీఆర్ నంబర్‌తో తిరిగే వాటిపైనా నిఘా పెంచారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తో నెల రోజులు మాత్రమే తిరగాలి. కానీ కొందరు వివిధ కారణాలతో సంవత్సరాల తరబడి టీఆర్‌తో బండి నడిపించేస్తున్నారు. ఈ ఉల్లంఘనపై కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కాగా, నంబర్‌ప్లేట్ ట్యాంపరింగ్‌పై స్పెషల్ డ్రైవ్‌లు కొనసాగుతున్నాయని, పట్టుబడ్డ వారిపై చార్జిషీట్లు వేసే ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైందని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు.
చార్జిషీట్ దాఖలు
నంబర్ ప్లేట్‌కు సంబంధించిన వివిధ రకాల ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు ఇక నుంచి చార్జిషీట్లు వేయనున్నారు. నాన్‌కాంటాక్టు పద్ధతిలో చలాన్లు జారీ చేస్తున్నా.. నంబర్ సరిగా లేకపోవడంతో ఉల్లంఘనదారులకు చేరుకోవడం లేదు. కొందరు పక్కా ప్లాన్‌తో ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘనలకు పాల్పడుతుంటే.. మరికొందరు నేరాలు చేసేందుకు నంబర్ ప్లేట్ అంకెలను చెరిపేస్తున్నారు. మరికొందరు అసలు నంబర్ లేకుండా తిరుగుతున్నారు.
కోర్టుకు వెళ్లాల్సిందే..
నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసిన వారిపై పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేయిస్తున్నారు. అయినా వారిలో మార్పు రావడం లేదు. ఇక నుంచి ఇలాంటి ఉల్లంఘనదారులను ట్రాఫిక్ పోలీసులు కోర్టుకు రప్పించనున్నారు. చార్జిషీట్లు వేస్తుండటంతో న్యాయస్థానాలే శిక్షలను నిర్ణయించనున్నాయి. అందులో జరిమానాలు ఉండవచ్చు, లేక జైలు శిక్ష, సామాజిక సేవ కార్యక్రమాలు ఏదైనా ఉండే అవకాశాలున్నాయి.