సుల్తాన్‌బజార్, జూన్ 12: మొగురం బస్తీ ఉలిక్కిపడింది. రసాయన పేలుడు సంభవించి ఓ వ్యక్తి మృతిచెందడం కలకలం రేపింది. అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మహారాజ్‌గంజ్ మొగురం బస్తీలో గోపాల్ భట్టడ్ కిరాణ బిజినెస్‌తో పాటు గిరిరాజ్ కెమికల్ పేరిట కుమారుడు భరత్ భట్టడ్(32)తో కలిసి రసాయనాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం తండ్రి, కొడుకులు కలిసి గడువు ముగిసిన 30 లీటర్ల రసాయన క్యాన్లను ఇంటి ముందు శుభ్రం చేస్తుండగా, అది భారీ శబ్దంతో పేలిపోవడంతో భరత్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.
అతడి శరీరం ముక్కలైంది. పేలుడు సంభవించే సమయంలో ఇంటిలోని నల్లా పైపును కట్టేసేందుకు లోపలికి వెళ్లడంతో గోపాల్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. పేలుడు జరిగిన ప్రాంతంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. మూడు మీటర్ల వరకు పేలుడు తాలుకు అవశేషాలు ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమవ్వగా, మరో రెండు బైక్‌లు కొద్దిగా దెబ్బతిన్నాయి. ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, అఫ్జల్‌గంజ్ ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి, సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ పద్మతో పాటు క్లూస్ టీం బృందంతో ఘటనా స్థలికి చేరుకొని.. క్షుణ్ణంగా పరిశీలించారు. గోపాల్ చేగుంటలోని ఫ్యాక్టరీ నుంచి రసాయనాలను సేకరించి విక్రయిస్తున్నట్లు తెలిసింది. వాటిని రెగ్జిన్, ప్లాస్టిక్, పాలిథీన్ల కోసం వాడుతున్నట్లు గుర్తించారు.
ఆక్సిజన్ శాతం ఉండటంతో..
కెమికల్ డ్రమ్ములను తక్కువ నీటిని వాడి శుభ్రపరిచాలి. ఈ విషయం తెలియక ఇంట్లోని నల్లా నుంచి పైపును జోడించి కాలువ వద్ద క్యాన్లను శుభ్ర పరిచారు. నీటి లో ఆక్సిజన్ శాతం ఉండడంతో పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ బస్తీలో నివాసాల మధ్య రసాయనాల గోదాంను నడిపిస్తున్న వీరికి లైసెన్సు ఉందా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.