మేడ్చల్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో నేటితో ధాన్యం కొనుగోళ్లు పూర్తికానున్నాయి. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు రూ. 20.96 కోట్ల విలువజేసే 10 లక్షల 695 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదును రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 7,685 ఎకరాల విస్తీర్ణంలో వరిసాగు చేశారు. 11 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, 2318 మంది రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వరి కోతలు ముగియడంతో ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. వ్యవసాయశాఖ వానాకాలం పంటల సాగు ప్రణాళికను కూడా విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 22,694 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలను సాగు చేసేలా ప్రణాళికను రూపొందించారు. వానాకాలం పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. కూరగాయలు, పండ్లు, పత్తి, కంది పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేలా వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కలిపిస్తున్నారు.