సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): నగర శివారుల్లోని ఐటీ కారిడార్‌లో పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులు చేపట్టింది. అన్ని ప్రాంతాలపై అధ్యయనం చేసిన సర్కార్.. అవసరమైన ప్రాంతాల్లో చర్యలు చేపట్టింది. ప్రధానంగా ఐటీ కంపెనీలు మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ ప్రాంతాల్లోనే కాకుండా కోకాపేట, పుప్పాల్‌గూడ, నార్సింగి తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. కంపెనీల సంఖ్య పెరగడంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ కూడా గణనీయంగా పెరుగుతున్నది.
దీన్ని దృష్టిలో పెట్టుకొని హెచ్ఎండీఏ అధికారులు పలు మార్గాల్లో ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లను విస్తరించే పనులు చేపట్టారు. ప్రస్తుతం రెండు లేన్లు ఉన్న రహదారిని 4 లేన్లుగా మారుస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.300 కోట్లు వెచ్చిస్తున్నారు. గచ్చిబౌలి-నానక్‌రాంగూడ నుంచి ప్రారంభమై, శంషాబాద్ వెళ్లే మార్గంలోని తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 7.5 కి.మీ, నార్సింగి నుంచి కొల్లూరు వరకు 12 కి.మీ. మేర ఓఆర్ఆర్ సర్వీసు రోడ్ల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో మూడునాలుగు నెలల్లో పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.