హైదరాబాద్ ఆట ప్రతినిధి,జూన్ 12 : జాతీయ,అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌ల్లో రాణిస్తున్న తెలంగాణ క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని క్రీడలు, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం గండిపేటలోని వీనస్ ఇన్ఫోటెక్ ఆధ్వర్యంలో యూఎస్ ఐటీ స్టాపింగ్ కార్పొరేట్ ప్రొఫెషనల్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, ఉమాకాంత్, విష్ణువర్ధన్, ప్రవీణ్‌కుమార్,అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
23న ఒలింపిక్‌డే రన్
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23న ఒలింపిక్‌డే రన్ నిర్వహిస్తున్నామని, దీనికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి జగదీశ్వర్‌యాదవ్ ప్రకటించారు. 23న చార్మినార్, చాదర్‌ఘూట్ విక్టోరియా మెమోరియల్ మైదానం, యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం, బోయిన్పల్లి, మెహిదీపట్నం, ఓయూ ఆర్ట్స్ కళాశాల, ఫతేమైదాన్ క్లబ్, వైఎంసీఏ నారాయణగూడ, ఖైరతాబాద్‌లో ఉదయం 6 గంటలకు రన్‌ను ప్రారంభమై ఎల్బీ స్టేడియం చేరుకుంటుందన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ప్రేమ్‌రాజ్, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ కోశాధికారి రాజేష్, తెలంగాణ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి శోభన్బాబుగౌడ్, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ తైక్వాండో కోశాధికారి సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
బ్యాడ్మింటన్ విజేత మోహిత్‌కుమార్
హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను మోహిత్‌కుమార్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన అండర్-17 సింగిల్స్ ఫైనల్స్‌లో మోహిత్‌కుమార్ 15-12, 15-10 స్కోర్ తేడాతో హర్షవర్ధన్‌పై విజయం సాధించారు. విజేతలకు హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరనాథ్ బహుమతులు అందజేశారు.
ఓపెన్ చెస్టోర్నీ విజేత సృజన్ కీర్తన్
193వ బ్రిలియంట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ టైటిల్‌ను సృజన్ కీర్తన్, జూనియర్ టైటిల్‌ను నిధీష్ శ్యామల్ సొంతం చేసుకున్నారు. దిల్సుఖ్నగర్ బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో ఆదివారం నిర్వహించిన జూనియర్ ఫైనల్స్‌లో ఓపెన్ కేటగిరీలో సృజన్ కీర్తన్, కీర్తి గంటా, రితీష్ చందర్‌లు అగ్రస్థానాలు దక్కించుకున్నారు.
ఫుట్‌బాల్ లీగ్ పోటీల్లో సోషల్ స్పోర్టింగ్ జట్టు విజయం
తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సీ డివిజన్ ఫుట్‌బాల్ లీగ్ చాంపియన్‌షిప్‌లో సోషల్ స్పోర్టింగ్ జట్టు విజయం సాధించింది. సికింద్రాబాద్ జింఖానా ఫుట్‌బాల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సోషల్ స్పోర్టింగ్ జట్టు 1-0 గోల్ తేడాతో యంగ్ స్పోర్టింగ్ జట్టుపై విజయం సాధించింది.