సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో మరిన్ని చిట్టడవులను సృష్టించాలని బల్దియా నిర్ణయించింది. ఈ మేరకు ఎనిమిదో విడత హరితహారంలో కాలనీల్లో గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. ఇందులోభాగంగానే అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అధికారులు 4,846 కాలనీలను గుర్తించారు.
ప్రణాళిక సిద్ధం
కాలనీలు పచ్చదనంతో కళకళలాడాలని ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బల్దియా ఉన్నతాధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఈసారి హరితహారంలో కోటి 25 లక్షల మొక్కలే లక్ష్యంగా కార్యాప్రణాళిక సిద్ధమైంది. ఇందుకోసం 970 చోట్ల ఖాళీ స్థలాలను ఎంపిక చేశారు. అక్కడ అడవి వాతావరణాన్ని సృష్టించేందుకు బల్దియా ఈసారి దేశవాళీ మొక్కలకు ప్రాధాన్యమిచ్చింది. నర్సరీల్లో రావి, మర్రి, వేప, కానుగ, చింత తదితర మొక్కలను పెద్ద ఎత్తున పెంచింది. కాలనీ ప్లాంటేషన్‌లో భాగంగా 3వేల కాలనీలను వంద శాతం గ్రీనరీగా మలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికల్లా ఎంపిక చేసిన కాలనీల్లో అంతర్గత రహదారులు, ఇనిస్టిట్యూషన్స్, ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించనున్నారు. మరోవైపు ఈ ఏడాది మరో 160 కిలోమీటర్లలో మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టనున్నారు. అలాగే 185 చెరువుల్లో 18 చోట్ల గ్రీనరీ పనులు చేపట్టగా..మిగిలినవి ఈ ఏడాది పూర్తి చేయనున్నారు.