వారంతా మహిళా ఉద్యోగులు. ఎదుటివారికి కష్టం వస్తే మేమున్నామంటూ అభయమిస్తారు. ఆకలేస్తుందని చెబితే అన్నం పెడుతారు. పేదరికం చదువును దూరం చేస్తుందని తెలిస్తే విద్యను అందిస్తారు. దుస్తులు, పుస్తకాలు లేవంటే కొనిపెడుతారు. తినడానికి తిండేలేకపోతే నిత్యావసర సరుకులు ఇంటికి పంపిస్తారు. ఇలా అవసరం ఎలాంటిదైనా ఎవరూ బాధపడకూడదనేదే వారి లక్ష్యం. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతూ వందలాది మందికి అండగా నిలుస్తున్నారు కొందరు మహిళా ఉద్యోగులు. జీతంలో కొంత సొమ్ముతో అభాగ్యులకు సాయం అందిస్తూ దాతృత్వం చాటుకుంటున్నారు. రాత్రిపూట నగరంలో పర్యటించి అనాథలకు దుప్పట్లు,అన్నం ప్యాకెట్లు, నిరుపేదలకు సాయం అందించి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఫంక్షన్లు చేసి తమ స్టేటస్‌ను చూపించాలని చాలా మంది తాపత్రయపడుతుంటారు. అందుకోసం లక్షలు వెచ్చించి వేడుకలు నిర్వహిస్తారు. మధ్యతరగతి ప్రజలు అప్పు చేసి మరీ తాము తక్కువేం కాదనే పసందైన విందులు ఇచ్చి తమ దర్పాన్ని చూపిస్తారు. ఫలితంగా దుబారా ఖర్చు తప్పని పరిస్థితులు ఎదురవుతాయి. ఇలాంటి సందర్భంలో కొంతమంది మహిళా ఉద్యోగులు తమ జీతంలో కొంత సేవా కార్యక్రమాలకు కేటాయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తల్లిదండ్రులు కోల్పోయి.. ఆర్థిక సమస్యలతో చదువుకు దూరమైన పిల్లలను చేరదీసి వారికి విద్యనందించడం, కొవిడ్ సమయంలో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు నివాసం, ఆరోగ్యం ఇతర అవసరాలతో అండగా నిలుస్తున్నారు. పదో తరగతి పూర్తి చేసి ఉన్నత చదువులు చదవలేకపోతున్న నిరుపేదలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ గల విద్యార్థులు ఉన్నత చదువుల కోసం తమకు నచ్చిన కాలేజీల్లో చేర్పించడానికి సహాయం చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులకు బుక్స్, స్టేషనరీ, ప్లే సామగ్రి అందించి విద్యార్థులపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి వ్యాపారానికి సంబంధించిన పరికరాలు అందించి అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా దివ్యాంగులకు, వారి పిల్లలకు ఏం కావాలో సమకూర్చుతూ ఆత్మైస్థెర్యం నింపుతున్నారు.
నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం
సహాయం చేయడానికి ముందుకొస్తున్న వారందరూ గొప్పవారే. కేవలం మన గురించి ఆలోచించకుండా ఇతరుల గురించి ఆలోచించడం మంచి విషయం. నా పాకెట్ మనీ, షూటింగ్ డబ్బులు వీలైనంతగా సహాయం చేయడానికే కేటాయించడం నాకు ఇష్టం. లాక్డౌన్లో చాలా మంది సమస్యలు ఎదుర్కొన్నారు. వీలైనంత వరకు ఉపాధి లేక కష్టాలు పడుతున్న బస్తీవాసులకు నెలకు సరిపడా సరుకులు అందించి ఆదుకునే ప్రయత్నం చేశాం.
– సాయి హన్సిక. ఆర్టిస్టు
ఆడపిల్లల చదువుకు ఆటంకం రావొద్దు
నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. వారి చదువు కోసం నేను ఎప్పుడూ సాయం అందించడానికి సిద్ధంగా ఉంటాను. వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చదువుకునేలా చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. చాలా మంది మహిళలకు ఉపాధి నిమిత్తం కుట్టుమిషన్లు అందించాం. సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది. అందుకోసం ప్రతి ఒక్కరూ ముందుకురావాలి. ఎవరికైనా సాయం కావాలంటే మా జగతి ఫౌండేషన్‌ను సంప్రదించొచ్చు.
చదువుకుంటేనే స్వశక్తితో ముందుకు
కష్టాల్లో ఉన్నవారికి ఏదో ఒక రకంగా అండగా నిలిస్తే జీవితానికి సరిపడా తృప్తి లభిస్తుంది. ఆపదలో ఉన్నవారిని చూస్తే మనసు తల్లడిల్లుతుంది. వారికి నా వంతుగా ఏదో ఒక సహాయం అందించాలని నిర్ణయించుకుంటాను. ముఖ్యంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదు. విద్యయే వారికి ఆస్తి. స్వశక్తితో ఎదిగే అవకాశాన్ని ఇస్తుంది. అందుకే ఆర్థికంగా చదువుకు దూరమైన వారికి అండగా ఉంటున్నాం. ఎవరికైనా సాయం కావాలంటే 9908088258 నంబర్‌కు ఫోన్ చేయొచ్చు. మా టీం ఆ సమస్యను పరిశీలించి చేయగలిగిన సాయం అనుకుంటే వెంటనే స్పందిస్తాం.
– సారా, ఐటీ ఉద్యోగి