మేడ్చల్ రూరల్, జూన్ 12: నగర శివారులో 44వ జాతీయ రహదారిని ఆనుకొని, కండ్లకోయ రింగు రోడ్డు కూడలికి సమీపంలో ఉన్న కండ్లకోయ ఆక్సిజన్ పార్కు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నది. వారమంతా తమ తమ ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతరత్రా వ్యవహారాల్లో ఊపిరిసలపకుండా గడిపే నగరవాసులు ఈ ఆక్సిజన్ పార్కుకు వచ్చి సేద తీరుతున్నారు. మేడ్చల్‌తో పాటు కొంపల్లి, సుచిత్ర, సూరారం, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, తూప్రాన్, కాళ్లకల్ తదితర ప్రాంతాల నుంచి శని, ఆదివారం పార్కు వచ్చి, ఊపిరి పీల్చుకుంటున్నారు. 70 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పచ్చని వనంలో కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడుపుతున్నారు. ఓపెన్ క్లాస్ రూం, సీతాకోకచిలుక, పక్షుల సంరక్షణ కేంద్రం, గజబో తదితర ప్రాంతాల్లో పర్యటించి, సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ మైమరిచిపోతున్నారు. ప్రీ వెడ్డింగ్, బర్త్‌డే, నిశ్చితార్థం తదితర ఈవెంట్లకు ఫొటో, వీడియోలు తీసుకుంటున్నారు. సందర్శకులతో పాటు వీడియో, కెమెరాలకు అదనంగావసూలు చేస్తున్న రుసుంతో పార్కు నిర్వహణకు ఆదాయం సమకూరుతున్నది. ప్రతి రోజు 200 నుంచి 300 మంది వరకు, వారాంతంలో మాత్రం 500 నుంచి 600 మంది పార్కులను సందర్శిస్తున్నారు.