సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : ఇంకా ఎండాకాలం పోనేలేదు..వర్షాకాలం రానేలేదు..నగరంలో డెంగీ విస్తరిస్తున్నది. చాపకింద నీరులా డెంగీ కేసులు పెరుగుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ ఏడాది జనవరి మాసం నుంచి జూన్ వరకు గ్రేటర్‌వ్యాప్తంగా 182 డెంగీ కేసులు నమోదైనట్లు వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. 2020 నుంచి 2021 మధ్యకాలంలో కరోనా కారణంగా సీజనల్ వ్యాధులు చాలావరకు తగ్గాయి. ప్రధానంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి కేసులు పెద్దగా నమోదు కాలేదు. కరోనా ప్రభావంతో ప్రజలు తీసుకున్న జాగ్రత్తలు, ప్రభుత్వం చేపట్టిన చర్యలకు తోడు జాతర్లు, పండుగలు, సామూహిక కార్యక్రమాలు రద్దవడం, జనం పెద్దగా బయటకు రాకపోవడం వంటి కారణాలతో రెండేండ్లపాటు డెంగీ కేసులు నమోదు కాలేదు. రెండు నెలలుగా ఇతర జిల్లాలతో పోల్చితే గ్రేటర్లో డెంగీ కేసులు అధికంగా నమోదవుతుండడంతో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జలుబు లేకుండా జ్వరం వస్తే డెంగీగా అనుమానించి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలంటున్నారు వైద్యనిపుణులు.
ఇండ్లల్లోనే డెంగీ కారకాలు
సాధారణంగా ఎడిసన్ ఆడదోమ పగలు సమయంలోనే మనిషిని కుడుతుంది. ఇది మంచినీటిలో వృద్ధిచెందుతుంది. మురికినీటిలో ఉండదు. డెంగీకి కారణమయ్యే ఎడిసన్ దోమలు ఇండ్లల్లోని పూలకుండీలు, పాత సామాన్లు, రబ్బరు టైర్లు, ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు, కూలర్లు తదితర వాటితో ఇంటి పరిసరాల్లో వృద్ధి చెందుతాయి.
డెంగీ ప్రధాన లక్షణాలు : జలుబు లేకుండా జ్వరం రావడం, కళ్ల కింద నొప్పి, ప్లేట్లెట్స్ పడిపోవడం, అకస్మాత్తుగా తీవ్రజ్వరం రావడం, భరించలేని తలనొప్పి, కండరాలు, కీళ్లు, ఒంటి నొప్పి, చర్మంపై దద్దుర్లు, అధిక దాహం, బీపీ పడిపోవడం.
బస్తీ దవాఖానల్లో ఎలీసా పరీక్షలు, చికిత్స
డెంగీ కేసులు నమోదవుతుండడంతో ముందస్తు చర్యలు మొదలుపెట్టాం. జీహెచ్ఎంసీ ఎంటమాలజి విభాగం దోమల నివారణకు చర్యలు తీసుకుంటోంది. వైద్యశాఖ ఆధ్వర్యంలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాం. డెంగీ కేసు నమోదైన ఇంటి పరిసరాల్లో కనీసం 50 ఇండ్లల్లో సర్వే జరిపి జ్వరం ఉన్నవారిని గుర్తిస్తున్నాం. ఇండ్లల్లో లార్వా వృద్ధి చెందే ప్రదేశాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ప్రతి బస్తీ దవాఖానలో ఎలీసా పరీక్షలతోపాటు చికిత్స జరుపుతున్నాం. -డాక్టర్ వెంకటి, డీఎంహెచ్‌వో, హైదరాబాద్
గతంతో పోల్చితే కేసులు తక్కువే
గడిచిన రెండేళ్లతో పోల్చితే ఇప్పుడు నమోదవుతున్న డెంగీ కేసుల సంఖ్య తక్కువే. అయినా అప్రమత్తంగానే ఉన్నాం. ఇండ్లలో నీరు నిల్వకుండాచూసుకోవాలి. వారానికోరోజు డ్రై డే పాటించాలి. జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 3 రోజులైనా జ్వరం తగ్గకపోతే దగ్గరలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఆశ్రయించాలి. నీరు బాగా తాగాలి.
-డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌వో, రంగారెడ్డి జిల్లా