వెంగళరావునగర్, జూన్ 11: పేదల కోసం పనిచేసే ప్రభుత్వం తమదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. వెంగళరావునగర్ కాలనీ అయ్యప్ప గ్రౌండ్స్‌లో రూ.5 కోట్ల వ్యయంతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ భవన నిర్మాణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. గోపీనాథ్ మాట్లాడుతూ పేదింటి, మధ్యతరగతికి చెందిన యువతుల పెళ్లిళ్లు చేయాలంటే ఫంక్షన్ హాళ్లకు అధిక డబ్బును వెచ్చించాల్సి వస్తోందని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ల పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసే డబ్బులో సగం డబ్బంతా పెళ్లిళ్ల కోసం ఫంక్షన్ హాళ్లకే ఖర్చు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. పేదలకు ఇకపై భారం పడకుండా ఉండేందుకు మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్‌ను నిర్మిస్తున్నామని, దానిని ఏడాదిలోపు అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఫంక్షన్ హాల్ భవనంతో పాటు అవసరమయ్యే వంట పాత్రలు, టెంట్ హౌస్ సామగ్రి పూర్తిగా ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మతి భ్రమించిందని, అతన్ని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్, యూసుఫ్‌గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, కాలనీ అధ్యక్షుడు రాజశేఖర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, డివిజన్ అధ్యక్షుడు కోనేరు అజయ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి వేణు, మాజీ కార్పొరేటర్ శ్యామ్ రావు, జీటీఎస్ దేవస్థానం చైర్మన్ చిన్న రమేష్, టీఆర్ఎస్ నాయకులు నాగార్జునరెడ్డి, వేణుగోపాల్ యాదవ్, విజయ్ ముదిరాజ్, గజ్జెల బాలకృష్ణ, పవన్ ముదిరాజ్, శ్రీనగర్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు అప్పూఖాన్, డివిజన్ అధ్యక్షులు సంజీవ, సంతోష్ ముదిరాజ్, మన్సూర్, కృష్ణమోహన్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.