మలక్‌పేట, జూన్ 11:సైబర్ నేరాలపై ప్రజలు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సెల్ఫోన్లలో వచ్చే మెసేజ్‌లకు, ఫోన్‌కాల్స్‌కు దురాషపడి స్పందించి వివరాలు చెప్పి అకౌంట్లు ఖాళీ చేసుకోవద్దని మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ సూచించారు. శనివారం మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో సైబర్ నేరాలపై చర్చీల పాస్టర్లకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలో నేటికీ అనేక మందికి సైబర్ నేరాలపై సరైన అవగాహనలేదని, ముఖ్యంగా తక్కువ చదివిన వాళ్లు, నిరక్షరాస్యులు వారి వలలో తొందరగా పడుతుండగా, విద్యావంతులు కూడా దురాషపడి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారని తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ఫ్రాడ్స్, ఓఎల్ఎక్స్ ప్రాడ్స్, ల్యాటరీ ఫ్రాడ్స్, లోన్ యాప్స్ ఫ్రాడ్స్ తదితర అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నారని, మీ బ్యాంక్ ఎకౌంట్‌కు ఆధార్ లింకు చేస్తామని, కేవైసీకి ఆధార్ లింక్ చేస్తామని, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల నుంచి మాట్లాడుతున్నామని, ప్రభుత్వ పథకాల పేరుతో అకౌంట్ నంబర్ల వివరాలు తెలుసుకునేందుకు మెసేజ్లుగాని, ఫోన్లుగాని వస్తే స్పందించవద్దని, అలాంటి నంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టుకోవాలని సూచించారు.
మూడు కమిషనరేట్ల పరిధిలోని అన్ని పీఎస్‌ల పరిధిలోని చర్చీల పాస్టర్లకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని, పాస్టర్లకు అవగాహన కల్పించటంలో ముఖ్యోద్దేశం ఏమిటంటే వారు చర్చీలకు ప్రార్థనల కోసం వచ్చే క్రైస్తవులను కూడా అప్రమత్తం చేయాలని, సైబర్ నేరాలపై వారికి కూడా అవగాహన కల్పించి జాగృత పరుచాలనే సద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయాలు, మసీదులు, చర్చీల్లో నిర్వాహకులకు అవగాహన కల్పించడం ద్వారా వారు సామూహికంగా ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మలక్‌పేట, సైదాబాద్, అంబర్‌పేట పీఎస్‌ల డీఐలు నాను నాయక్, సురేష్, ప్రభాకర్, ఎస్ఐ సుభాష్‌తోపాటు వివిధ చర్చీల పాస్టర్లు పాల్గొన్నారు.