హయత్‌నగర్, జూన్ 10: కామంతో కండ్లు మూసుకుపోయిన ఓ ఆటో డ్రైవర్ అభంశుభం తెలియని తొమ్మిదేండ్ల చిన్నారిపై మూడురోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ దారుణ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఎన్టీఆర్నగర్ ఫేజ్-2లో నివాసముండే సలీం(30) భార్యతో నిత్యం గొడవ పడుతుండడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. మూడు నెలలుగా ఒంటరిగా ఉంటున్న సలీం ఓ బాలికపై కన్నేశాడు. మధ్యాహ్న సమయంలో ఆ బాలికను బెదిరించి.. సిగరెట్ తెప్పించి.. లైంగిక దాడి చేశాడు. బాధితురాలికి వాళ్ల బాబాయి అంటే భయం ఉండడంతో ఈ విషయాన్ని బయటికి చెబితే…అతడికి చెప్పి.. కొట్టిస్తానని బెదిరించాడు. మూడు రోజులుగా బాలిక సలీం ఇంట్లోకి వెళ్లడాన్ని గమనించిన పక్కింటి మహిళ గురువారం రాత్రి విషయాన్ని బాధితురాలి తల్లికి చెప్పింది. దీంతో ఆమె కూతురిని విషయం అడగ్గా, మూడు రోజులుగా సలీం తనపై అత్యాచారం చేస్తున్నట్లు తెలిపింది. స్థానికుల సహాయంతో పాప తల్లి సలీంపై దాడి చేసి.. ఎల్బీనగర్ పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసులను నమోదు చేసి అరెస్టు చేశారు.
ఢిల్లీలో యువతిపై..
సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): డేటింగ్ యాప్‌లో పరిచయమైన హైదరాబాద్ వాసి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఢిల్లీకి చెందిన యువతి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్‌కు చెందిన ఫార్మా వ్యాపారికి, డేటింగ్ యాప్‌లో ఢిల్లీకి చెందిన 28 ఏండ్ల యువతి పరిచయమైంది. వీరిద్దరు మే 30 న ఢిల్లీలోని ఓ హోటల్లో కలుసుకున్నారు. ఆ సమయంలో అతడు తనపై లైంగిక దాడి చేసినట్లు జూన్ 3న బాధితురాలు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుడు పరారీలో ఉన్నాడని, పట్టుకుంటామని ద్వారకా డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు.
బాలికను పెండ్లి చేసుకొని..
సైదాబాద్, జూన్ 10: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన పదమూడేండ్ల బాలికను పెండ్లి చేసుకున్న యువకుడు ఆపై లైంగికదాడికి పాల్పడ్డాడు. సైదాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి కథనం ప్రకారం….కొత్తపేటలో నివాసముంటున్న శ్రీకాంత్(23) ఆటో డ్రైవర్. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ బాలిక (13)ను గురువారం నగర శివారులోని ఓ ఆలయం వద్ద పెండ్లి చేసుకున్నాడు. అనంతరం కొత్తపేటలోని తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు గురువారం రాత్రి సైదాబాద్ పోలీసులను ఆశ్రయించగా, శుక్రవారం నిందితుడిని పట్టుకొని పోక్సో కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు.
వీడియో తీసి..
బడంగ్‌పేట, జూన్ 10: బాలికపై లైంగిక దాడి చేయడమే కాకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్న యువకుడిని అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు. మీర్‌పేట సీఐ మహేందర్‌రెడ్డి వివరాల ప్రకారం బడంగ్‌పేటలో నివాసముంటున్న బాలిక(15)ను ఆమె సహ విద్యార్థి నల్లకుంటకు చెందిన అమిత్‌వర్ధన్(19) పెండ్లి చేసుకుంటానని చెప్పి.. బలవంతంగా లైంగికదాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆమెకు తెలియకుండానే వీడియో తీశాడు. ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వైరల్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం అమిత్వర్ధన్పై పోక్సో కేసు పెట్టి.. అరెస్టు చేసి..రిమాండ్‌కు తరలించారు.
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో..మరో ఇద్దరు కస్టడీకి..
సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో సాదుద్దీన్ మాలిక్‌ను రెండో రోజు కస్టడీలో పోలీసులు విచారించారు. మిగతా జువెనైల్ నిందితుల్లో ముగ్గురిని కస్టడీకి శుక్రవారం నుంచి అనుమతివ్వగా, మరో ఇద్దరిని కూడా శనివారం నుంచి విచారించేందుకు కోర్టు అనుమతి లభించింది. శనివారం ఉదయం 10 గంటలకు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని జూబ్లీహిల్స్‌కు స్టేషన్‌కు తరలిస్తారు. అక్కడ విచారణ అనంతరం సాయంత్రం ఐదు గంటల్లోపు తిరిగి వాళ్లను హోంకు తరలిస్తారు.