సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): పెండ్లి చేసుకుంటానంటూ నగర మహిళను నమ్మించి మోసం చేసిన ఓ ఆఫ్రికన్‌ను సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ గజారావు భూపాల్ కథనం ప్రకారం.. ఆఫ్రికాకు చెందిన కబ్రాల్ ఎడ్మోండో అలియాస్ బ్రైట్ ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో నివాసముంటున్నాడు. వివిధ మ్యాట్రిమోనీ సైట్లలో నకిలీ ఖాతాలు తయారు చేసి, అందమైన ఫొటోలు పెట్టి విదేశాల్లో మంచి ఉద్యోగం, వ్యాపారం చేస్తున్నట్లు ప్రొఫైల్ రూపొందించి.. మహిళలను బుట్టలో వేసేవాడు. ఈ క్రమంలో బోయిన్‌పల్లికి చెందిన బాధితురాలితో తన పేరు కృష్ణకుమార్ అని, స్కాట్లాండ్, యూకేలో ఉంటున్నానంటూ పరిచయం చేసుకున్నాడు.
ఫేస్బుక్లో చాటింగ్ చేశాడు. పెండ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పాడు. కొన్ని రోజుల తరువాత కలిసేందుకు భారత్‌కు వస్తున్నానంటూ నమ్మించాడు. ఫిబ్రవరి 7న స్కాట్లాండ్లోని గ్లాస్గో నుంచి విమానంలో బయలుదేరుతున్నానని చెప్పి, మరుసటి రోజు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగినట్లు ఫోన్ చేశాడు. ఎయిర్‌పోర్టు వాళ్లు కొన్ని క్లియరెన్స్‌లు అడుగుతున్నారని, డబ్బులు చెల్లించాలని కోరాడు. నమ్మిన బాధితురాలు పలు దఫాలుగా రూ. 10.65 లక్షలు చెల్లించింది. మోసమని గుర్తించి సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ గంగాధర్ బృందం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టింది. నిందితుడిని ఢిల్లీలో పట్టుకొని.. శుక్రవారం హైదరాబాద్‌కు తరలించారు.
ఎఫ్బీలో పరిచయమై.. నగ్న వీడియోలతో
ఫేస్బుక్లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను ముగ్గులోకి దింపిన సైబర్‌చీటర్స్.. నగ్న వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి మొత్తం రూ. 1.13 లక్షలు కాజేశారు. అయి నా వేధింపులు ఆగకపోవడంతో బాధితులిద్దరూ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోకేసులో ఫేస్బుక్లో పరిచయమైన సైబర్‌చీటర్ ఓ వైద్యుడికి రూ. 3.7 లక్షలు టోకరా వేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారంటూ నమ్మించి డబ్బులు కాజేశాడు.
లండన్ వర్సిటీలో చదువుతూ..సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కి..
సైబర్‌నేరగాళ్ల చేతిలో చిక్కిన నగర యువకుడు లండన్ పోలీసులతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. లండన్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు పరిచయమయ్యాడు. నీవు రూ. 5 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉంది కాదా, ఆ డబ్బు నేను ఇక్కడ చెల్లిస్తాను.. హైదరాబాద్‌లో మా సోదరుడి ఖాతాలో డబ్బు జమ చేస్తే.. సరిపోతుందం’టూ చెప్పాడు. దీనికి బాధితుడు అంగీకరించడంతో ఇరువురు ఆ ప్రక్రియ పూర్తి చేశారు. ఇదిలాఉండగా మూడు నెలల తరువాత బాధితుడి వద్దకు వచ్చిన లండన్ పోలీసులు సైబర్‌నేరానికి పాల్పడ్డావంటూ.. అరెస్ట్ చేస్తున్నామన్నారు.
ఇక్కడ పరిచయమైన వ్యక్తి ఇక్కడ ఫీజు చెల్లించాడని, నేను హైదరాబాద్‌లో వాళ్లకు అప్పగించానంటూ చెప్పాడు. అయితే పోలీసులు వర్సిటీకి కట్టిన రూ. 5 లక్షలు రికవరీ చేసుకొని, అమాయకుడైన బాధితుడిని వదిలేశారు. కాగా, హైదరాబాద్‌లో ఉన్న యువకుడిని ఆరా తీయగా, లండన్ నుంచి వచ్చిన ఆదేశాలతో మరికొన్ని ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేశానని, తన వద్ద డబ్బు లేదని ఏం చేసుకుంటారో చేసుకోండంటూ బాధితుడి కుటుంబ సభ్యులను బెదిరించాడు. దీంతో అతడి కుటుంబసభ్యులు శుక్రవారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు.