సికింద్రాబాద్, జూన్ 10: బస్టాపుల్లో ప్రయాణికులుగా నటిస్తూ..ప్రయాణికుల బ్యాగులను తస్కరించి.. అందులోని నగలను కాజేస్తున్న ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను గోపాలపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 43.25 తులాల ఆభరణాలు, 4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ చందనా దీప్తి, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ వివరాలు వెల్లడించారు. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆర్టీసీ బస్టాపుల వద్ద ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పెట్రోలింగ్ చేస్తున్న గోపాలపురం పోలీస్ క్రైమ్ కానిస్టేబుళ్లు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. నిందితులు యూపీలోని కమలాపూర్ గ్రామానికి చెందిన దిన్ మహ్మద్ (42), అదే గ్రామానికి చెందిన మహ్మద్ గుల్జీద్ (52), మహ్మద్ జేనేద్ అస్లాం (35), మహ్మద్ ఆన్సార్ అలీ (37) రియాసద్ (37), బబ్లూ అహ్మద్ (32)లుగా గుర్తించారు. నగరంలోనే కాకుండా ఇతర జిల్లాల్లోనూ దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలింది.