సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలోని సిటీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్ జారీ చేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే సిటీ బస్సుల్లో డెబిట్ కార్డు, క్రెడిట్‌కార్డు, గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా టికెట్ జారీ ప్రక్రియ కొనసాగించేందుకు కసరత్తు చేస్తున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా గ్రేటర్ ఆర్టీసీ జోన్ పరిధిలో ఎయిర్ పోర్టుకు వెళ్లే పుష్పక్ బస్సులలో నగదు రహిత లావాదేవీలతో టికెట్ జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ ఫీడ్ బ్యాక్ మొత్తం వచ్చిన తర్వాత సిటీ బస్సుల్లో కూడా త్వరలోనే డెబిట్, క్రెడిట్ కార్డు, గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా టికెట్ జారీ ప్రక్రియ కొనసాగిస్తామని ఆర్టీసీ సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ వెంకన్న తెలిపారు.
అందుకోసం ప్రస్తుతం ఎయిర్‌పోర్టు పుష్పక్ బస్సుల్లో ఐటీమ్స్ పేరుతో ఉన్న ఆధునిక మిషన్లు బస్సు టికెట్ల జారీ కోసం ఉపయోగిస్తున్నామన్నారు. ఈ మిషన్‌లో నగదు రహిత లావాదేవీలకు సంబంధించి అత్యాధునిక పద్ధతుల్లో టికెట్ల జారీ ఉంటుందని తెలిపారు. ప్రయాణికులకు నగదు ఇవ్వకుండా కార్డు, యూపీఐ ద్వారా చెల్లించే సదుపాయం అందుబాటులోకి తీసుకురావడాన్ని అందరూ స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే బస్సు పాసు కేంద్రాలు, రిజర్వేషన్ కేంద్రాల్లోనూ నగదు రహిత లావాదేవీలు కొనసాగుతున్నాయని చెప్పారు.
విద్యాసంస్థల మార్గాల్లో అదనపు ట్రిప్పులు
ఈ నెల 15 నుంచి విద్యా సంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ మార్గాల్లో సిటీ బస్సుల ట్రిప్పులను పెంచనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ సికింద్రాబాద్ ప్రాంతీయ మేనేజర్ తెలిపారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్న రూట్లలో అదనపు ట్రిప్పులకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అలాగే అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ప్రయాణికులు కోసం సిటీ సర్వీసులు నడుపుతున్నామని, మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.
త్వరలో పల్లె వెలుగులో కూడా అమలు..
బస్ టికెట్ల జారీ ప్రక్రియలో నగదు రహిత లావాదేవీలను దశల వారీగా సిటీలోని అన్ని రకాల బస్సులలో అమలు చేయడంతో పాటు డిస్ట్రిక్ట్ బస్సులు, ఏసీ బస్సులతో పాటు పల్లెవెలుగు బస్సులలో కూడా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల ప్రయాణికులకు బస్సులో చిల్లర సమస్య నుంచి విముక్తి లభిస్తుందని తెలిపారు. అందుకు సంబంధించి ఐటిమ్స్ మిషన్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేయాల్సి ఉన్నదని, ఈ అంశంపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.