మేడ్చల్, జూన్10 (నమస్తే తెలంగాణ): బడిబాటకు విశేష స్పందన లభిస్తున్నది. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో భారీ సంఖ్యలో చేరుతున్నారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంలో ఇప్పటి వరకు 793 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఇందులో ప్రైవేట్ పాఠశాలల నుంచి 339 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒకటో నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం నేరుగా ఇండ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను వివరిస్తున్నారు.
ఇంటి వద్దే విద్యార్థులకు అడ్మిషన్లు -కూడా ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత మధ్యాహ్న భోజనం, ఉచిత మినరల్ నీరు, క్రీడలు, వ్యాయామం, ఉపకార వేతనాలు.. లాంటి ప్రయోజనాలను విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయ బృందాలు వివరిస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి వస్తున్న విషయాన్ని కూడా చెబుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చించేందుకు ఉత్సాహం..
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చించేందుకు తల్లిదండ్రులు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు కల్పిస్తున్నాం. నాణ్యమైన విద్యను అందిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నది. బడిబాట కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 793 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు అడ్మిషన్లు తీసుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చిన 339 మంది విద్యార్థులు ఇప్పటికే అడ్మిషన్లు పొందారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. – విజయ కుమారి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా విద్యాధికారి