మారేడ్‌పల్లి, జూన్ 10: పట్టణ ప్రగతి ద్వారా బస్తీ, కాలనీల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుంటూ..వాటి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న తెలిపారు. మోండా డివిజన్ మారేడ్‌పల్లి లోని లోహియా నగర్ బస్తీలో శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగింది. బస్తీలో జీహెచ్ంఎసీ, జలమండలి విభాగాలకు చెందిన వివిధ అధికారులతో కలిసి ఎమ్మెల్యే సాయన్న పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా బస్తీలో స్ట్రీట్ లైట్లు, సీసీ కెమెరాలు, బోర్వెల్, కమ్యూనిటీహాల్‌ను ఏర్పాటు చేయాలని బస్తీ వాసులు ఎమ్మెల్యేకు వివరించారు.
అనంతరం ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ…పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా లోహియానగర్ బస్తీలో స్థానిక ప్రజలు పలు సమస్యలను తమ దృష్టికి తీసుకొని రావడం జరిగిందని త్వరలో వాటిని పరిష్కరించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ ప్రవీణ్, ఆంజనేయులు, ఏఈ రవీందర్, జలమండలి సిబ్బంది, జీహెచ్ఎంసీ మాజీ కో ఆప్షన్ సభ్యుడు సీఎన్. నర్సింహ ముదిరాజ్, టీఆర్ఎస్ నాయకులు పిట్ల నాగేష్ ముదిరాజ్, సి, సంతోష్‌యాదవ్, సదానంద్, కిరణ్, శ్రీహరి, భాస్కర్ ముదిరాజ్ , రాము, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
సత్వరమే
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్10: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి నాలుగవ విడుతలో భాగంగా సమస్యలను గుర్తించి, వాటిని సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి అన్నారు. తార్నాక డివిజన్లోని మాణికేశ్వరీనగర్‌లో అధికారులతో కలిసి ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, తక్షణం వాటి మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి, ఏఎంవోహెచ్ డాక్టర్ రవీందర్‌గౌడ్, శానిటేషన్ సూపర్వైజర్ ధనగౌడ్, జలమండలి డీజీఎం నిఖితారెడ్డి, ఏఈ వెంకటేశ్, హార్టికల్చర్ సూపర్వైజర్ సింధుజ, టీఎస్ఎస్పీడీసీఎల్ ఏఈ భరత్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.