మహేశ్వరం, జూన్ 10: టీఆర్ఎస్తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మహేశ్వరం మండల కేంద్రంలో రూ.20లక్షలతో మార్కెట్ యార్డు, రూ.68లక్షలతో ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లను ఎమ్మెల్సీ దయానంద్ గుప్తతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహేశ్వరానికి సీఎం కేసీఆర్ అత్యధిక నిధులను ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. కోట్ల రూపాయలతో మహేశ్వరం రూపురేఖలు మారుస్తామని అన్నారు. రోడ్డు వెడల్పునకు సహకరించిన వ్యాపారస్తులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మహేశ్వరం గేట్ నుంచి ఇమామ్ గూడ నుంచి మహేశ్వరం పారిశ్రామిక వాడ వరకు రూ.5కోట్లతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.
త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అన్నారు. విప్రో లాంటి సంస్థలు మహేశ్వరం రావడంతో ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందుతుదన్నారు. మహేశ్వరం, తుక్కుగూడ ప్రాంతాల్లో 52 కంపెనీలు వచ్చాయని, వాటి ద్వారా రూ.3వేల కోట్ల పెట్టుబడులు మన ప్రాంతానికి రావడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషితో మన ప్రాంతంతో పాటు రాష్ర్టానికి భారీగా ప్రైవేటు కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. 90 వేల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇప్పటికే 11 వేల కాంట్రాక్టు ఉద్యోగాల రెగ్యూలరైజేషన్తో పాటు వివిధ శాఖలో ఖాళీగా ఉన్న 80 వేలకు పై చిలుకు ఉద్యోగాల కల్పనకు దశలవారీగా నోటిఫికేషన్లను ఇస్తున్నామని అన్నారు. తెలంగాణకు వెల్లువలా వస్తున్న పెట్టుబడులతో ప్రైవేటు రంగంలోనూ యువతకు భారీగా ఉద్యోగావకాశాలు వస్తున్నాయని తెలిపారు.
కేంద్రం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి, ఉన్న ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తుందని కేంద్రపై నిప్పులు చెరిగారు. రాష్ర్టాభివృద్ధికి కృషి చేస్తున్న వారిని ఆదరించి అండగా ఉండాలని అన్నారు. అనంతరం నూతన మార్కెట్ యార్డులో నిమ్మకాయలు, టమాటాలను మంత్రి కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్ గుప్త, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్, సహకారబ్యాంక్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంగోత్ రాజూయక్, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్‌రెడ్డి, మహేశ్వరం సర్పంచ్ కరోళ్ల ప్రియాంకారాజేశ్, ఎంపీటీసీ సుదర్శన్‌యాదవ్, మాజీ సర్పంచ్ ఆనందం, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకుడు కూన యాదయ్య, ఎన్డీ తండా సర్పంచ్ మెగావత్ రాజూనాయక్, మాజీ ఉపసర్పంచ్ దోమ శ్రీనివాస్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆదిల్ అలీ, డైరెక్టర్లు కడమోని ప్రభాకర్, పొల్కం బాలయ్య, దిద్దెల అశోక్‌కుమార్ నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, మంత్రి రాజేశ్, మద్ధి కరుణాకర్‌రెడ్డి, బండారు లింగం, జాన్‌రెడ్డి, పి.ఆంజనేయులు గౌడ్, అంజయ్యయాదవ్, నవీన్, కటికెల మైసయ్య, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.