సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ): మృతి చెందిన పాలసీదారుడి కుటుంబానికి రూ.5లక్షల పరిహారం చెల్లించాలని హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.లక్ష్మిప్రసన్నతో కూడిన బెంచ్ ఆదేశించింది. నగరంలోని ఫ్రెండ్స్కాలనీకి చెందిన జి.వరూదిని తన భర్త పేరుతో రూ.7లక్షల విలువగల ప్రోగ్రోత్ ప్లస్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని 2017లో తీసుకున్నారు. ప్రతియేటా రూ.లక్ష ప్రీమియం చెల్లించేవారు. పాలసీ కాలపరిమితి జూలై 18, 2027వరకు ఉన్నది. భర్త అనారోగ్యంతో కేర్ దవాఖానలో చికిత్స పొందుతూ హృదయ సంబంధిత, శ్వాసకోశ రుగ్మతతో 2019లో మృతి చెందాడు. పాలసీని క్లెయిమ్ చేయాలని నామినీ వరూదిని కంపెనీని కోరింది.
అయితే పాలసీ పొందే క్రమంలో అనారోగ్య విషయాలను వెల్లడించలేదని, అందువల్ల తాము బీమాను చెల్లించలేమని తేల్చిచెప్పారు. దీంతో బాధితురాలు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1ను ఆశ్రయించి న్యాయం చేయాలని అభ్యర్థించారు. కాగా బీమా సంస్థ నియమించిన పరిశోధకుడి అఫిడవిట్ ద్వారా బీమా చేసిన వ్యక్తికి మధుమేహం ఉందని తేలింది. అయితే పాలసీదారు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యుడి ధ్రువీకరణ ఉందని బాధితులు పేర్కొన్నారు. అయితే మధుమేహానికి గుండెపోటుకు సంబంధం ఉందని వైద్య రికార్డులు తెలుపడం లేదని కమిషన్ పేర్కొన్నది. అందువల్ల బీమా సంస్థ వాదన సహేతుకంగా లేదని తెలిపింది. బాధితురాలికి రూ.5,35,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. దీంతోపాటు నష్టపరిహారం కింద రూ.10వేలు, ఖర్చులకు మరో రూ.5వేలు చెల్లించాలని ఆదేశించింది. బీమా పాలసీ కంపెనీలు పాలసీదారులపట్ల బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది.