మేడ్చల్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న టెట్ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్లో మంగళవారం టెట్ పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాధికారి విజయ కుమారితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టెట్ పరీక్షలకు 55 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉదయం 9:30 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే పరీక్షా కేంద్రాలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పరీక్షలకు 26 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 12,883 మంది అభ్యర్థులు టెట్ పరీక్షలకు హాజరుకానున్నట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు.
పరీక్షల నిర్వహణకు 650 అధికారులు సిబ్బందిని నియమించామన్నారు. పరీక్ష సమయం దాటి ఒక్క నిమిషం అలస్యమైనా అనుమతించమని కలెక్టర్ హరీశ్ అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది, మంచినీటి సౌకర్యం, నిరంతర విద్యుత్ సౌకర్యాలు కల్పించాలన్నారు. పరీక్ష సమయానికి కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు నడిపించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.