సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలలో ఉంటున్న ప్రజలకు వరద ముప్పు లేకుండా నాలాల పూడికతీత పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ ప్రేమ్ నగర్ కాలనీలో మేయర్ పర్యటించి కాలనీల సమస్యలను తెలుసుకొని అకడికడే పరిషారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నాలాల పునరుద్ధరణ, రిటైనింగ్ వాల్ నిర్మాణాలకు జీహెచ్ఎంసీ పరిధిలో 37 పనులు వివిధ దశలో ఉన్నాయని వెల్లడించారు. వర్షాకాలంలో వరద ముంపు నివారణకు ప్రత్యేక మాన్సూన్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ప్రత్యేకంగా నాలాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వరద ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జోనల్ వారీగా వల్బారెబుల్ పాయింట్లను గుర్తించి ఇనుప కంచెలు, ప్రీకాస్టు స్లాబ్స్, హెచ్చరిక బోర్డ్లు ఏర్పాటు చేసినట్లు మేయర్ వివరించారు. డ్రెస్ కోడ్ పాటించని యస్ఎఫ్ఏ, పారిశుద్ధ్య కార్మికులపై మేయర్ మండిపడ్డారు. చిల్డ్రన్ పారు సందర్శించి కొత్త పరికరాలను అమర్చి బోర్డ్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్డీపీ సీఈ కిషన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.