సుల్తాన్‌బజార్,జూన్ 7: ఫుట్‌వేర్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో భవనం చుట్టూ పొగ అలుముకుంది. ఈ ప్రమాదం సెల్లార్లో జరిగింది. భవనం పైఅంతస్తుల్లో ఉంటున్న కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. దాదాపు ఎనిమిది గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు కథనం ప్రకారం.. సుల్తాన్‌బజార్ గోకుల్‌చాట్ వెనుక భాగంలోని మూడంతస్తుల నారాయణ కాంప్లెక్స్‌లోని సెల్లార్లో హసన్ఖాన్కు సంబంధించిన ఎన్కే ఫుట్‌వేర్ గోదాం ఉంది.
రోజువారి మాదిరిగానే సోమవారం రాత్రి కూడా నిర్వాహకులు తొమ్మిది గంటల సమయంలో గోదాంను మూసివేసి ఇంటికి వెళ్లారు. రాత్రి పది గంటల సమయంలో గోదాంలో అగ్నిప్రమాదం సంభవించి ఆ ప్రాంతమంతా పొగతో కమ్ముకుంది. ఆ భవనం పైఅంతస్తుల్లో ఉంటున్న కుటుంబాలు భయాందోళనకు గురయ్యాయి. విషయం తెలుసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు, అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజన్లు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. నాలుగు ఫైర్ ఇంజన్ల సహాయంతో ఎనిమిది గంటల పాటు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకువచ్చారు.
అదే విధంగా, మొదటి అంతస్తులో చిక్కుకున్న నలుగుర్ని కూడా అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని, సుమారు రూ.మూడు లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్‌రెడ్డి, అదనపు జిల్లా ఫైర్ ఆఫీసర్ తంగెళ్ల శ్రీనివాస్‌తో పాటు ఇతర అధికారులు, పోలీస్ శాఖ అధికారులు ప్రమాద స్థలాన్ని సందర్శించారు.