సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ప్రీమియం మొత్తంతోపాటు నష్టపరిహారాన్ని చెల్లించాలని వినియోగదారుల కమిషన్-3 అధ్యక్షుడు ఎం.రాంగోపాల్రెడ్డి, సభ్యులు డి.శ్రీదేవి, జె.శ్యామలతో కూడిన బెంచ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ను ఆదేశించింది. పాతనగరంలోని శాలిబండకు చెందిన విశ్రాంత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్బీ ఖన్నా ఎల్ఐసీ ద్వారా జీవన్ సరల్ పాలసీని నెలవారీ ప్రీమియం రూ.1031చొప్పున చెల్లించేందుకు పాలసీ తీసుకున్నాడు. తన సాలరీ ఖాతా నుంచి ప్రీమియం చెల్లించేందుకు ఒప్పుకున్నాడు. కాలపరిమితి రెండేండ్ల 11నెలలుగా నిర్ణయించారు. ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీసెస్ ద్వారా ప్రీమియం డబ్బులు చెల్లించాడు. అయితే, 2014లో అనారోగ్యంతో పాటు ప్రమాదంలో గాయపడగా కాలుకు గాయమైంది.
నాంపల్లిలోని కేర్ దవాఖానలో చేరాడు. అనంతరం 2015లో ఛాతినొప్పితో తిరిగి అదే వైద్యశాలలో చేరి చికిత్స పొందాడు. దీంతో ప్రీమియం డబ్బులు చెల్లించకపోవడంతో పాలసీ ల్యాప్స్ అయ్యింది. తన అనారోగ్య పరిస్థితుల వల్ల జాప్యం జరిగిందని, తిరిగి పాలసీని కొనసాగించాలని పాలసీదారు సంస్థను కోరాడు. అందుకు నిబంధనలు వర్తించవని ఎల్ఐసీ తెలిపింది. దీంతో పాలసీదారు వినియోగదారుల కమిషన్-3ను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు వివరాలను పరిశీలించిన కమిషన్.. రిన్యూవల్ చేయాలంటే రూ.లక్ష 19వేల 680 చెల్లించాలని ఎల్ఐసీ తెలిపింది. ఇది మొత్తం పాలసీ విలువకంటే ఎక్కువని.. ఇది నిబంధనలకు విరుద్ధం కాదా.. అంటూ కమిషన్ ప్రశ్నించింది. నిబంధనల ప్రకారం పాలసీదారుడు ప్రీమియం ఎంత చెల్లించాడో అంతే డబ్బు (రూ.35,185) ను చెల్లించాలని ఆదేశించింది. అంతేగాకుండా నష్టపరిహారంగా రూ.10వేలు, ఖర్చుల కింద రూ.5వేలు చెల్లించాలని ఆదేశించింది.