సిటీబ్యూరో, జూన్ 7(నమస్తే తెలంగాణ): వీఆర్ఆర్ డెవలపర్స్ రాజిరెడ్డికి మూడేండ్ల జైలు శిక్షను విధిస్తూ మల్కాజిగిరి కోర్టు మంగళవారం తీర్పును వెల్లడించింది. కుషాయిగూడ పరిధిలోని సర్వే నం. 505, 506, 518, 519, 520,5 23 లోని స్థల యజమానులైన పి.ఎల్లారెడ్డి, అరుణను సంప్రదించి వీఆర్ఆర్ డెవలపర్స్ పేరుతో ప్లాట్లను విక్రయిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత యజమాని పరిధిలో ఉన్న మరో 22 ప్లాట్లను కూడా అమ్మాలని ఒత్తిడి చేశారు. యజమానులు వాటిని విక్రయించేందుకు ఇష్టపడలేదు. దీంతో రాజిరెడ్డి ఆ 22 ప్లాట్లకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించాడు. అంతేకాకుండా యజమానులు తీవ్రంగా బెదిరించాడు. దీంతో బాధితులు కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించడంతో కేసును నమోదు చేశారు.
దర్యాప్తులో రాజిరెడ్డిపై నమోదైన అభియోగాల ఆధారాలను కోర్టు విచారణలో పోలీసులు నిరూపించారు. దీంతో రాజిరెడ్డికి మంగళవారం మల్కాజిగిరి న్యాయస్థానం మూడేండ్ల జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానాను విధించింది. ఇదిలా ఉండగా, రాచకొండ పరిధిలో వీఆర్ఆర్ రాజిరెడ్డిపై దాదాపు 10కి పైగా స్థల వివాదాలు, నకిలీ పత్రాలతో కబ్జాలు, బెదిరింపులు వంటి అంశాలపై కేసులు ఉన్నాయని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేశాడని, పోలీసులు, ప్రజా ప్రతినిధుల పేర్లను చెప్పుకుని అమాయకులను బెదిరిస్తుంటాడని తెలిసింది. రాజిరెడ్డి బాధితులు దాదాపు 500 మంది పైగా బాధితులు ఉంటారని సమాచారం.