సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ మహానగరంలో భవిష్యత్ పట్టణ ప్రజా రవాణా వ్యవస్థే లక్ష్యంగా హైదరాబాద్ యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (హెచ్‌యూఎంటీఏ)ని 2008లో ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థలను అధ్యయనం చేయడానికి, ఈ సంస్థ కార్యకలాపాలు ప్రతిష్టాత్మకంగా పనిచేసేందుకు మేనేజింగ్ డైరెక్టర్‌తోపాటు ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్టు ఇంజనీర్లు, ప్లానర్లు, అర్బన్ ప్లానర్స్ను నియామకం చేసింది. ఇది దేశంలోని మొదటి సంస్థ.
రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ విధానం..
హైదరాబాద్‌ను టైర్-2 నగరాలతో, పొరుగు రాష్ర్టాలతో కలపగలిగేలా సెమీ హైస్పీడ్ రైల్ సిస్టమ్ సాధ్యాసాధ్యాలను హెచ్‌యూఎంటీఏ అన్వేషిస్తోంది. సుమారు 1000 కి.మీ పొడవునా కాన్సెప్ట్ ప్లాన్ రూపొందించింది. దీనికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేపడుతున్నారు. ఇందులో హైదరాబాద్ నుంచి వరంగల్‌కు, హైదరాబాద్ నుంచి విజయవాడకు చేపట్టాలని నిర్ణయించారు. అదేవిధంగా ముంబై నుంచి హైదరాబాద్‌కి మధ్యలో హైస్పీడ్ రైల్ కనెక్టివిటీపైనా కసరత్తు చేపట్టారు. హెచ్‌యూఎంటీఏ సంస్థ నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్‌తో కలిసి ఏదుల నాగులపల్లి నుంచి కోకాపేట ప్రాంతానికి టర్మినల్ స్టేషన్‌కి పొడిగించే అవకాశంపైనా సమన్వయం చేసేందుకు అన్వేషణ కొనసాగిస్తున్నారు.
ఐటీ కారిడార్‌లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ విధానం..
ఐటీ కారిడార్‌లో రద్దీ గణనీయంగా పెరుగుతోంది. దీంతో ఆ ప్రాంతానికి అనుగుణంగా అత్యాధునిక శైలిలో ఉండేలా, సులభంగా, పర్యావరణ హితంగా ఉండేలా పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ విధానంపై కసరత్తు మొదలు పెట్టారు. దీన్ని మొదట రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి చుట్టు పక్కల ప్రాంతాలైన మైండ్‌స్పేస్, నాలెడ్జ్ సిటీ, ఇనార్బిట్‌మాల్ వరకు లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా చేపట్టనున్నారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ చుట్టు పక్కల ప్రాంతాలను కవర్ చేస్తూ సుమారు 7.5 కిమీ పరిధిలోని ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందుకోసం ఇంగ్లండ్‌కు చెందిన అల్ట్రా పీఆర్టీ లిమిటెడ్ సంస్థలో ఒప్పందాన్ని చేసుకున్నామని ఇటీవల పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన నివేదిక ఈ అంశాన్ని ప్రస్తావించారు.
రోడ్డుపై ట్రాఫిక్ చిక్కులు లేకుండా రోప్‌వే మార్గాలు..
హుస్సేన్‌సాగర్ చెరువు పర్యాటక కేంద్రంగా మారింది. నిత్యం పెద్ద సంఖ్యలో సందర్శకులు విచ్చేస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చెరువు చుట్టూ లూప్ రూపంలో ఒక సమగ్రమైన రోప్‌వే నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించి, దీనికి సంబంధించిన అధ్యయనం, ప్రాజెక్టు రూపకల్పనపై హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో కసరత్తు జరుగుతోంది. అదేవిధంగా నగరంలో మరో మూడు ప్రాంతాల్లోనూ రోప్ వే ప్రాజెక్టుల ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు. ఈ జాబితాలో కారిడార్-1లో భాగంగా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి జూలాజికల్ పార్కుకి వయా ఎంజీబీఎస్ 7.62 కి.మీ పరిధిలో రోప్‌వేను నిర్మించాలి. కారిడార్-2లో ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టేట్ అసెంబ్లీ మీదుగా ప్యారడైజ్ మెట్రో స్టేషన్ వరకు పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ విధానం కోసం ప్రతిపాదన రూపొందించారు. కారిడార్-3లో రాయిగిరి నుంచి యాదాద్రి టెంపుల్ టౌన్ (6.2) కి.మీ రోప్‌వే విధానంను రూపొందించారు.
పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం ఇలా..
మెట్రో స్టేషన్ల చుట్టు పక్కల ప్రాంతాలకు ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీని కల్పించేందుకు 4-5 మంది ప్రయాణం చేసేలా సరికొత్తగా పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (పీఆర్టీఎస్)ను తీసుకురావాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రోడ్డు మార్గంలో కాకుండా ఆకాశ మార్గంలో ప్రత్యేకంగా మెట్రోరైలు మాదరిగా ట్రాక్స్‌ను నిర్మించి, దానిపై కారు తరహాలో ఉండే ఎలక్ట్రిక్ వాహనం రాకపోకలు సాగించేలా మార్గాలను నిర్మిస్తున్నారు.
రోప్ వే ఇలా..
నగరంలో పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్‌సాగర్ చుట్టూ రోడ్డు మార్గం ఉంది. దీనికి అదనంగా సాగర్ చుట్టూ ప్రత్యేకంగా 6 కేంద్రాలను గుర్తించి, వాటిని కలుపుతూ ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ హుస్సేన్ సాగర్ తీర ప్రాంతంలోని అందాలను వీక్షించేలా రోప్‌వేను ఏర్పాటు చేయనున్నారు.