మేడ్చల్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగర శివారు ప్రాంత మున్సిపాలిటీలలోని డంపింగ్ యార్డులలో కంపోస్ట్ ఎరువుల తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు ఇప్పటికే మూడు మున్సిపాలిటీలలో కంపోస్ట్ ఎరువుల తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. మరో 10 మున్సిపాలిటీలలోనూ కంపోస్ట్ ఎరువుల తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. శివారు మున్సిపాలిటీలను వందశాతం చెత్తరహిత నగరాలుగా తీర్చిదిద్దే క్రమంలో కంపోస్ట్ ఎరువుల తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది.
జిల్లాలో ఇప్పటికే మేడ్చల్, పీర్జాదిగూడ, కొంపల్లి మున్సిపాలిటీలలో ప్లాంట్లను ఏర్పాటు చేయగా బోడుప్పల్, జవహర్నగర్, నిజాంపేట్, పోచారం, ఘట్కేసర్, దమ్మాయిగూడ, తూంకుంట, గూండ్లపోచంపల్లి, నాగారం, దుండిగల్లో ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి దశలో మూడు మున్సిపాలిటీలకు ఒకటి చొప్పున కంపోస్ట్ ఎరువుల తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. మేడ్చల్లో రూ. కోటి నిధులతో ఏర్పాటు చేయగా పీర్జాదిగూడ కార్పొరేషన్లో రూ. 40 లక్షలు, కొంపల్లిలో రూ. 80 లక్షలతో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రకృతి వనాలకు వినియోగం
తడి-పొడి చెత్తల ద్వారా తయారైన కంపోస్ట్ ఎరువులను పట్టణ, పల్లె పకృతి వనాలకు వినియోగించేలా ప్రణాళికలను రూపొందించారు. ఇప్పటికే పీర్జాదిగూడ, మేడ్చల్ ప్లాంట్లలో తయారైన కంపోస్ట్ ఎరువులను పట్టణ, పల్లె పకృతి వనాలకు వినియోగిస్తూన్నారు. మిగతా మున్సిపాలిటీలలో ప్లాంట్ల ఏర్పాటు అనంతరం వచ్చే కంపోస్ట్ ఎరువులను పట్టణ, పల్లె పకృతి వనాలకు వినియోగిస్తూ మున్సిపాలిటీల పర్యవేక్షణలో కంపోస్ట్ ఎరువులు అవసరమైన వారికి చౌకగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.