ఖైరతాబాద్, జూన్ 7: హైదరాబాద్ మహా నగరంలోని సైఫాబాద్ మింట్‌కు 119 ఏండ్ల చరిత్ర ఉంది. నాటి నిజాం కాలంలో ఇక్కడ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థగా విరాజిల్లింది. ఆ చరిత్రని మరోసారి నెమరేసుకుంటూ ఖైరతాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ‘ది సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ (ఎస్పీఎంసీఐఎల్) ఆధ్వర్యంలో నాణేల ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఆజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా భారత ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తృప్తి పాత్ర ఘోజ్ ప్రారంభించారు. అనంతరం, పురాతన నాణేలతో పాటు ప్రస్తుతం చలామణిలో ఉన్న నాణేలు సైతం అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ 1903లో ఇక్కడ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారన్నారు. ఇక్కడ షేర్ షా సూరి అందించిన మొదటి రూపాయి నాణెంతో పాటు సుల్తాన్ షాహి కాలం నాటి నాణేలు సైతం అందుబాటులో ఉన్నాయన్నారు.
నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ప్రజలు మ్యూజియాన్ని సందర్శించేలా వీలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం సంస్థ డైరెక్టర్ ఎస్కే సిన్హా, ఫైనాన్స్ డైరెక్టర్ అజయ్ అగర్వాల్, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ కె.నిఖిల, ఇన్టాక్ విభాగాధిపతి అనూరాధా రెడ్డి, సాలార్జంగ్ మ్యూ జియం డైరెక్టర్ డాక్టర్ ఏఎన్ రెడ్డి, సీఐఎస్ఎఫ్ డీఐజీ డి.శ్యామల, ఆర్థిక మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ రాజీవ్ సింగ్, సఫీయుల్లా, అమర్బీర్ సింగ్, డాక్టర్ అంచూరి పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం ఖైరతాబాద్‌లోని మింట్ కాంపౌండ్ సంస్థ ఉద్యోగులు వాకథాన్ నిర్వహించారు. ఈ వాకథాన్‌ను ది సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సీఎండీ తృప్తి పాత్ర ఘోష్ ప్రారంభించారు.