బేగంపేట, జూన్ 7: నగరంలో భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచిన బల్కంపేట రేణుకా ఎల్లమ్మ అమ్మ వారి కల్యాణాన్ని జూలై 5వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మాసబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో అమ్మవారి కల్యాణం నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, 4వ తేదీ ఎదుర్కోళ్లు, 5వ తేదీ అమ్మవారి కల్యాణం, 6న రథోత్సవం నిర్వహించనున్నట్టు తెలిపారు. అమ్మవారి కల్యాణాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీలలో చూసేలా ఏ ర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అమ్మవారి కల్యాణానికి వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
అమ్మవారి దర్శనం, కల్యా ణం కోసం ఇచ్చే పాస్‌లను డూబ్లీకేషన్కు ఆస్కారం లేకుండా బార్ కోడింగ్‌తో కూడిన పాస్‌లను జారీ చేయాలని ఆదేశించారు. కల్యాణం, రథోత్స వం సందర్భంగా ఆలయం వైపు రహదారులను మూసివేసి వాహనాల మళ్లింపునకు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులను ఆదేశించారు. దేవాలయ పరిసరాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ వెంకట్‌ను మంత్రి ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా నడుపుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఈవో అన్నపూర్ణ, ఆలయ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.