మన్సూరాబాద్, జూన్ 5: ఓ సామాజిక కార్యకర్త చేస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకొని 12వ తరగతి చదువుతున్న విద్యార్థి సామాజిక సేవ చేసేందుకు పూనుకున్నాడు. స్ఫూర్తిని పొందిందే తడవుగా దాతృత సేవల్ని పెద్ద ఎత్తున చేపట్టాడు. ఆ విద్యార్థి ఎవరో కాదు.. ఓక్రిడ్జ్ స్కూల్లో చదువుతున్న రిశూల్ పాకాల. కరోనా కారణంగా జీవనోపాధి కోల్పోయిన నిరుపేదలను ఆదుకునేందుకు సామాజిక కార్యకర్త దోసపాటి రాము నాగోల్ డివిజన్ పరిధి రాక్హిల్స్ కాలనీలో రైస్ ఏటీఎంను ప్రారంభించి రెండేండ్లుగా నిరుపేదలకు నిత్యావసర సరుకులతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ విషయాన్ని నగరంలోని ఓక్రిడ్జ్ స్కూల్లో చదువుతున్న విద్యార్థి రిషూల్ పాకాల తెలుసుకున్నాడు. రామును స్ఫూర్తిగా తీసుకుని రిశూల్ ఆదివారం రాక్హిల్స్ కాలనీలోని రైస్ ఏటీఎంను సందర్శించి నిరుపేద కుటుంబాలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా “రెండు కుట్టు మిషన్లు, టీ స్టాల్ సామగ్రి, జ్యూస్ పాయింట్, తోపుడు బండ్లు-2తో పాటు 50 కుటుంబాలకు రైస్ బ్యాగ్స్”ను అందజేశారు. సేవా కార్యక్రమాల్లో తన స్నేహితులను సైతం భాగస్వాములను చేస్తానని రిశూల్ తెలిపారు.